రాష్ట్రంలో అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం, ఆపై మద్యం ధరలను భారీగా పెంచారు. మద్యం అలవాటును దూరం చేయటానికే ధరలను పెంచామన్నారు. బ్రాండెడ్ మద్యం అమ్మకాలను ఆపి ఊరు పేరు లేని నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి మద్యం సేవించే వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీశారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం అక్రమంగా రాష్ట్రానికి రావడం, ప్రభుత్వం అరికట్టలేక ధరలను కొంత తగ్గించి, పాత బ్రాండ్లను మరలా తీసుకు వచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలు మద్య నిషేధానికి విరుద్ధంగా, గందరగోళంగా ఉన్నాయి. మద్యం దుకాణాల వద్ద జరుగుతున్న అక్రమాలు అంతా ఇంతా కాదు. కోవిడ్ కాలంలో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించి నడిపారు. డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదు. అందుకు సహేతుక కారణాలు చెప్పరు! భవిష్యత్తులో మద్యం అమ్మకాల ఆదాయాన్ని అధిక మొత్తంలో చూపించి భారీగా బ్యాంకు రుణాన్ని తీసుకున్నారు! నగదు లావాదేవీలలో భారీ అవకతవకలతో ఇప్పుడు ఆ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు పెడతామంటున్నారు! మద్య నిషేధం అమలుకు చిత్తశుద్ధి ఉంటే ఇన్ని విన్యాసాలు అవసరమా? ఇలాంటి మోసపూరిత విధానాలతో పాలకులు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు.
జి.ఆర్,
ముస్తాబాద, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా.










