- కదలిక లేని ఫిషింగ్ హార్బర్
- అర్ధాంతరంగా ఆగిన మంచినీళ్లపేట జెట్టీ
- ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న పాలకులు
- మత్స్యకారుల్లో ఆగని వలసలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జిల్లాలో 193 కిలోమీటర్ల మేర విశాలమైన సముద్రతీరం ఉంది. లక్షన్నరకు పైగా మత్స్యకార జనాభా ఉంది. సుమారు 50 వేల కుటుంబాలు చేపల వేట పైనే బతుకుతున్నారు. అయినా జిల్లాలో ఒక్క హార్బరూ లేదు. ఒక్క జెట్టీకి దిక్కు లేకుండా పోయింది. టిడిపి అధికారంలో ఉన్నన్నాళ్లు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మిస్తామంటూ మాటలతోనే కాలక్షేపం చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీళ్లపేటతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీనిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూలపేట పోర్టుతో పాటు బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కూ శంకుస్థాపన చేశారు. తర్వాత ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఫిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణాలు ఇదిగో అదిగో అంటూ పాలకుల ఊరింపే తప్ప హామీలు వాస్తవరూపం దాల్చడం లేదు.
జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల పరిధిలో 104 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 1,46,192 మంది జనాభా, 46,580 కుటుంబాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల కిందట వరకు ఇందులో 80 శాతం కుటుంబాలు చేపల వేటపై బతకగా, మిగిలిన 20 శాతం కుటుంబాలు వ్యవసాయం, ఇతర వృత్తులు, కూలి పనులు చేసుకునేవారు. ప్రస్తుతం మత్స్యకారుల జీవన స్థితిగతులన్నీ తారుమారయ్యాయి. ఇందులో చేపల వేటకు వెళ్తున్న వారి సంఖ్య 13 వేల నుంచి 15 వేలు మాత్రమే ఉంది. చేపల వేట సరిగా సాగక వేలాది మంది మత్స్యకారులు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అక్కడ బోటు యజమానుల వద్ద కూలీలుగా పనిచేస్తున్నారు. గుజరాత్‌లోని ఒక్క వీరావల్ ప్రాంతంలోనే జిల్లాకు చెందిన మత్స్యకారులు సుమారు మూడు వేల మంది ఉన్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో చేపలు దొరక్కపోవడంతో వేలాది మంది మత్స్యకారులు ఏకంగా చేపల వేట మానుకుని ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. రోడ్డు వెంబడి టోపీలు, ఊయళ్లు అమ్ముకుని బతుకుతున్నారు. మరికొందరు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. కొంతమంది గ్రామాల్లోనే ఉంటూ ఆటోలు, ప్రయివేట్ వాహనాలకు డ్రైవర్లుగా వెళ్తున్నారు. ఇలా వేలాది మంది మత్స్యకారులు చేపల వేటకు దూరమవుతున్నారు.
తీర ప్రాంతాల్లో కొరవడిన మౌలిక వసతులు
జిల్లాలో మత్స్య సంపదను నిల్వ చేసేందుకు ఎక్కడా కోల్డ్ స్టోరేజీలు లేవు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, డి.మత్స్యలేశం, రాళ్లపేటలో జెట్టీ, కవిటి మండలం ఇద్దివానిపాలెంలో జెట్టీ, సోంపేట మండలం బారువలో జెట్టీ, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్లపేట జెట్టీ నిర్మాణ పనులు ముందుకు కదలడం లేదు. గతంలో బారువ, నువ్వలరేవు తదితర తీరాల్లో ఏర్పాటు చేసిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
కదలిక లేని ఫిషింగ్ హార్బర్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని 2020లో నిర్ణయించారు. ఇందుకోసం రూ.365.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. హార్బర్ నిర్మాణానికి 42 ఎకరాలు అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. 2020లోనే భూసేకరణ పూర్తి చేశారు. అదే సంవత్సరం గ్రామంలో పర్యావరణ మదింపు కూడా చేశారు. హార్బర్ నిర్మాణ వ్యవహారాలను ఎపి మారిటైం బోర్డు పర్యవేక్షిస్తోంది. గతేడాది మేలో టెండర్లను పిలిచిన ప్రభుత్వం, విజయవాడకు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. మూలపేట పోర్టుతో పాటు ఫిషింగ్ హార్బర్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
అర్ధాంతరంగా ఆగిన జెట్టీ
వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణ ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అందులో భాగంగా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిష్ లాండింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.13.95 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టింది. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.2.61 కోట్ల బిల్లులను చెల్లించకపోవడంతో పనులు ఆపేశారు. ఇప్పటివరకు 32 శాతమే పనులు పూర్తయ్యాయి. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మే 31వ తేదీ లోగా పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, పనులు పూర్తిస్థాయిలో కావడానికి కనీసం ఏడాదికి మించి సమయం పట్టే అవకాశం ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని నిర్ణయించింది. భూసేకరణ పనులు మినహా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం రూ.332.09 కోట్లతో ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది. ప్రస్తుతం నిర్మాణానికి అవసరమైన 40.88 ఎకరాల భూమిని సేకరించారు. ఫిషింగ్ హార్బర్‌తో పాటు జెట్టీ నిర్మాణం పూర్తయితే మత్స్యకారులు స్థానికంగానే ఉండి చేపల వేటతో సాగించేవారు. మత్స్య సంపద తగ్గడం, సౌకర్యాలు లేకపోవడంతో వారిలో వలసల పరంపర కొనసాగుతోంది.










