- రాష్ట్రపతి స్వోత్కర్ష
- ఉపాధి, పౌర హక్కుల ఊసేలేని కోవింద్ ప్రసంగం
- అభివృద్ది ఉరకలేస్తున్నట్లు కితాబు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా సెంట్రల్ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ప్రసంగించారు. 52 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం అసాంతం ప్రభుత్వం చేసిన గొప్పలు వల్లించడానికి సరిపోయింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పెగాసస్ లాంటి స్వైవేర్‌లతో ప్రభుత్వంపై ప్రజలపై నిఘా పెట్టి పౌర హక్కులను హరిస్తున్న వైనాలపైన ఔనని కానీ, కాదనీ కానీ ఆయన ప్రసంగంలో వాటి ఊసేలేదు. 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' మూలసూత్రంతో తమ ప్రభుత్వం 'మహా గొప్ప'గా పనిచేస్తోందన్న స్వీయ ప్రశంసలతోనే కోవింద్ ప్రసంగం సాగింది. అందులోని ముఖ్యాంశాలు..
అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 48 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) వచ్చాయన్నారు. దేశంలో పెట్టుబడులపై పెట్టుబడిదారులకున్న ధీమాను ఈ విషయం రుజువు చేస్తోందన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ఏడు మెగా టెక్స్‌టైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. మొబైల్ ఉత్పత్తుల పరిశ్రమ ఎదుగుదల మేక్ ఇన్ ఇండియా విజయవంతానికి నిదర్శనమని చెప్పారు.
2021-22లో 28 లక్షల స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.65 వేల కోట్ల సాయం అందించామని, ఈ మొత్తం 2014-15 కంటే 4 రెట్లు ఎక్కువని తెలిపారు. గతేడాది కాలంలో 24 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మాణం జరిగిందని అన్నారు. టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ యువశక్తి సామర్థ్యాన్ని ప్రశంసించారు. 2014తో పోలిస్తే ఖాదీ అమ్మకాలు మూడింతలు పెరిగాయని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ నివాళులు తెలియజేశారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పేద ప్రజలకు గూడు (ఆవాసం) కల్పించే హక్కును సాకారం చేసేందుకు ప్రభుత్వం కషి చేస్తోందని, ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే సంకల్పంతో ముందకు వెళ్తోందని అన్నారు. హర్ ఘర్ జల్ ఇనేషియేటివ్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఆరు కోట్లకు పైగా ట్యాప్ వాటర్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. దేశంలోని రైతులందరికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కషి చేస్తోందని రాష్ట్రపతి ప్రశంసించారు.
రక్షణ రంగానికి పెద్దపీట
దేశ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో మేక్ ఇన్ ఇండియాకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దష్టి సారించిందని చెప్పారు. డ్రోన్ కంపెనీలను ప్రోత్సహించేందుకు నిబంధనలను సరళతరం చేసిందని తెలిపారు. దేశంలో వచ్చే పాతికేళ్ల పునాదులు పటిష్టంగా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం కషి చేస్తోందని పేర్కొన్నారు.
33 సైనిక స్కూళ్లలో బాలికలకు అడ్మిషన్లు
బాలికలకు కూడా 33 సైనిక స్కూళ్లలోనూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో (ఎన్‌డిఎ) మహిళా క్యాడెట్ల ప్రవేశానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
2 లక్షల కోట్లు దాటిన వ్యవసాయ ఎగుమతులు
దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు. 2020-21 కోవిడ్ మహమ్మారి సమయంలోనూ 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించారని, 33 కోట్ల హార్టీకల్చర్ ఉత్పత్తులు సాధించారని చెప్పారు. ప్రభుత్వం 433 లక్షల మెట్రిక్ టన్నుల గోదువులు సేకరించిందని, దీంతో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. పిఎం కిసాన్ ద్వారా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం పొందాయని, రైతు కుటుంబాలకు రూ.1.80 లక్షల కోట్లు లబ్ధి చేకూరిందని అన్నారు.
ప్రజలను గౌరవించడంలోనే ప్రజాస్వామ్య పునాదులు
కేవలం ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే 150 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం రికార్డని చెప్పారు. 70 శాతం మంది లబ్ధిదారులు రెండో డోసు కూడా తీసుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్‌తో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు. ప్రజాస్వామ్య పునాదులు ప్రజలను గౌరవించడంలోనే ఉందని, అంబేద్కర్ మార్గదర్శక సూత్రాలు, సిద్ధాంతాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా ఫార్మారంగం అభివద్ధికి తమ ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. పేద ప్రజల హెల్త్‌కేర్‌కు ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రూ.64,000 కోట్లతో ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మిషన్ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.










