Jul 21,2021 06:41

ఆహారం, విద్యుత్‌, మందులు డిమాండ్‌ చేస్తూ క్యూబన్‌ వీధుల్లో ప్రజలు కనిపించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రభుత్వాల మాదిరిగా కాకుండా, క్యూబా సోషలిస్టు ప్రభుత్వానికి ప్రజల వాస్తవమైన ఇబ్బందులు, కష్టనష్టాల గురించి తెలుసు. అధ్యక్షుడు మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌ వెంటనే ఆ నిరసనలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి వారితో చర్చించారు. ప్రజలు చెప్పేది విని, వారి ఇబ్బందుల వెనుక గల కారణాలను, వాస్తవాలను వారికి వివరించే ప్రయత్నం చేయాల్సిందిగా క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పిసిసి) తన కార్యకర్తలను కోరింది. ప్రజల ఆర్థిక ఇబ్బందులకు కారణమైన, క్యూబాపై అమెరికా విధించిన 60 ఏళ్ళ నాటి ఆంక్షలను చర్చించకుండా క్యూబాలో ఏం జరుగుతోందో ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. ఈ నిరసనలకు గల కారణాలను అర్ధం చేసుకోలేరు.

హెల్మ్స్‌- బర్టన్‌ చట్టంలోని మూడవ అధికరణ (టైటిల్‌ 3) యొక్క వినాశకర ప్రభావాల గురించి, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ, అప్పటి ట్రంప్‌ ప్రభుత్వం విధించిన 243 అదనపు ఆంక్షలు గురించి క్యూబా ప్రభుత్వం, క్యూబా కమ్యూనిస్టు పార్టీ పదే పదే హెచ్చరిస్తూనే వచ్చాయి. ఈ సందర్భంగా డియాజ్‌ కానెల్‌ మాట్లాడుతూ, ''మేం నిజాయితీగా వున్నాం. పారదర్శకంగా వున్నాం. స్పష్టంగా వున్నాం. మా ప్రజల ప్రస్తుత పరిస్థితుల గురించి, వారు ఎదుర్కొంటున్న క్లిష్టమైన విషయాల గురించి మేం వివరిస్తూనే వచ్చాం. ఏడాదిన్నర క్రితం అంటే 2019 రెండో అర్ధభాగంలో అనుకుంటా, సంక్లిష్టమైన దశ దిశగా పయనిస్తున్నామని మేం చెప్పాం.'' అని గుర్తుచేసుకున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగానే ఇలా జరిగిందని అన్నారు. ఫలితంగా, క్యూబాతో వాణిజ్యం చేయాలనుకునే, ఆర్థిక సంబంధాలు కొనసాగించాలనుకునే దేశాలు, కంపెనీలన్నీ కూడా ఈ ఆంక్షల ముప్పును ఎదుర్కొన్నాయి. క్యూబన్లు జరిపే చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించారు. క్యూబాకు నడిపే విమానాలను తగ్గించారు. అన్నింటికన్నా, క్యూబాను తీవ్రవాద ప్రోత్సాహక దేశంగా అమెరికా ప్రకటించింది. క్యూబన్‌ వైద్య బృందాలను అప్రతిష్టపాల్జేసేలా నిరంతర ప్రచారాన్ని ప్రారంభించింది.

ఆంక్షలను ముమ్మరం చేయడం, కరోనా మహమ్మారి కారణంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ గతేడాది 11 శాతం మేరకు క్షీణించింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల పైకి ఎక్కించేందుకు క్యూబా ప్రభుత్వం, క్యూబా కమ్యూనిస్టు పార్టీ (పిసిసి) నిర్దిష్ట చర్యలను తీసుకుంది. ఈ రకమైన చర్యల కారణంగా, ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పరిమితమైన ప్రకృతి వనరులు గల క్యూబా ప్రధానంగా దిగుమతులపైనే ముఖ్యంగా ఆహారం, చమురు దిగుమతులపై ఆధారపడి వుంది. ఏళ్ళ తరబడి, క్యూబా కేవలం చెరకును మాత్రమే పండిస్తోంది. ఇతర ఆహార ఉత్పత్తులన్నింటినీ దిగుమతి చేసుకుంటోంది. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తర్వాత, వ్యవసాయంలో వైవిధ్యానికి క్యూబా ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ట్రంప్‌, హెల్మ్స్‌-బర్టన్‌ చట్టంలోని మూడవ అధికరణను అమలు చేసిన తర్వాత ఈ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అయినా సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి.

పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి కూడా మరో ప్రధాన అంశంగా వుంది. అమెరికా ఆంక్షలు పెద్ద అవరోధంగా మారడంతో క్యూబాకు చమురును తీసుకెళ్ళేందుకు పలు షిప్పింగ్‌ సంస్థలు తిరస్కరిస్తున్నాయి. దాంతో, విద్యుత్‌ ఉత్పత్తి బాగా దెబ్బతింటోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు మొదలుపెట్టారు. కరోనా మహమ్మారి సమయంలో, ఆస్పత్రులు వున్న ప్రాంతాల్లోనైనా విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించి చర్యలు తీసుకుంది. దాంతో, ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయి.అలాగే, చమురు పరిమితంగా లభించడం వల్ల దేశంలో రవాణా కూడా బాగా ప్రభావితం అవుతోంది. దీనితో ప్రజల రాకపోకలు నియంత్రించ బడుతున్నాయి. సహజంగానే ప్రజలు అసౌకర్యంగా భావిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న కంపెనీలు, అమెరికాలో తయారైన లేదా అమెరికాకు చెందిన కంపెనీలో తయారైన ఏ చిన్న విడిభాగాన్ని ఉపయోగించుకున్నప్పటికీ వారు క్యూబాతో వాణిజ్యం చేయబోమని అమెరికాకు హామీ ఇవ్వాల్సి వస్తోంది. డాలరు ఆధిపత్యం, అమెరికా నేతృత్వంలోని ఆర్థిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు అమెరికా ఒత్తిళ్ళకు తలగ్గుతున్నాయి.

క్యూబా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి వుంది. క్యూబాలో పని చేస్తే ఆంక్షలను ఎదుర్కొనాల్సి వస్తుందని పలు విమాన సంస్థలను, క్రూయిజ్‌ ఆపరేటర్లను బెదిరించారు. దీంతో వారు తమ కార్యకలాపాలను తగ్గించుకున్నారు. ఫలితంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది. పర్యాటకం, అనుబంధ వృత్తులపైనే ఆధారపడి జీవించే వారి ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటికన్నా, కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలతో దేశాల మధ్య ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణా దెబ్బతిన్నాయి. క్యూబాకు పర్యటించే పర్యాటకుల సంఖ్య దారుణంగా తగ్గిపోవడమే కాదు, కాస్తో, కూస్తో ఆంక్షలను ఎదుర్కొనే సాహసం చేసి క్యూబాకు నడిచే విమానాలు కూడా ప్రభావితం అయ్యాయి.
ఈ ఆంక్షలతో ఔషధాలను, వ్యాక్సిన్లను, వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే క్యూబా సామర్ధ్యం బాగా దెబ్బతింది. మందుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్ధాల కొరత ఎక్కువైంది. విషమంగా వున్న రోగులను కాపాడేందుకు అవసరమైన మందుల సరఫరాలు, ముఖ్యమైన పరికరాల దిగుమతుల కోసం అవసరమైన దాదాపు 200 కోట్ల డాలర్లు అందకుండా ఈ ఆంక్షలు క్యూబాకు అడ్డు తగిలాయి. ఉదాహరణకు వెంటిలేటర్లు దిగుమతి చేసుకోకుండా క్యూబాపై నిషేధం విధించారు.

ఇన్ని రకాల అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటున్నప్పటికీ, క్యూబా కరోనా సమయంలో వివిధ దేశాలకు తన వైద్య బృందాలను పంపి సేవలను అందించింది. ఇటలీతో సహా పలు యురోపియన్‌ దేశాలు క్యూబా వైద్య సిబ్బంది సేవలను ఉపయోగించుకున్నాయి. ఇక వివిధ లాటిన్‌ అమెరికా దేశాలు, ఆఫ్రికన్‌ దేశాల గురించి చెప్పనక్కరలేదు. కోవిడ్‌ సోకిన రోగులను తీసుకెళుతున్న క్రూయిజ్‌ లైనర్‌ తమ ఓడరేవుల్లో అనుమతి లేదని అమెరికా మూసివేయగా క్యూబా వారిని సాదరంగా ఆహ్వానించింది. పేటెంట్‌ హక్కుల కోసం అమెరికాకు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు పట్టుబడుతుంటే, ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారందరికీ తమ వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ముందుకొచ్చి ప్రకటించింది క్యూబానే. ఈ సేవలన్నింటికీ అంతర్జాతీయంగా ప్రజల నుండి విస్తృత స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. క్యూబన్‌ వైద్య సిబ్బందిని నోబెల్‌ శాంతి బహుమతి కోసం చాలామంది సిఫార్సు కూడా చేశారు.

సాయపడేందుకు బదులుగా, క్యూబా వైద్య సిబ్బంది చర్యలతో లబ్ధి పొందిన వివిధ దేశాలను అమెరికా బెదిరిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగా పుకార్లను వ్యాప్తి చేస్తోంది. ఆ వైద్య సిబ్బందిని తిరిగి క్యూబాకు పంపివేయాలని ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తోంది. బ్రెజిల్‌, ఈక్వెడార్‌, బలీవియా లు (సైనిక కుట్ర సమయంలో) అమెరికా ఆదేశాలకు తలగ్గాయి. తమ దేశాల్లోని నిరుపేద ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న వేలాదిమంది క్యూబన్‌ వైద్యులను వెనక్కి పంపాయి. కరోనా ఉధృతి పెరిగిన సమయంలో, ఈ క్యూబన్‌ డాక్టర్ల సేవలు తీవ్రంగా నష్టపోయారు.

తమ సొంతంగా వ్యాక్సిన్లు అభివృద్ధి పరుచుకోవడానికి కృషి చేస్తున్న సంపన్న, పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆ వ్యాక్సిన్లను నిరుపేద, వెనుకబడిన దేశాల ప్రజలకు అందచేయడానికి ముందుకు రావడం లేదని క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ అన్నారు. అందువల్ల, వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై మొత్తంగా కృషి చేయాల్సిందిగా తమ శాస్త్ర, సాంకేతిక సిబ్బందిని క్యూబా ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. ఈ సవాలును విజయవంతంగా ఎదుర్కొన్న క్యూబన్‌ శాస్త్రవేత్తలు, అన్ని అడ్డంకులను అధిగమించి, ఒకటి కాదు, ఏకంగా ఐదు వ్యాక్సిన్లను అభివృద్ధిపరిచారని చెప్పారు. వాటిలో రెండు (సోబెరనా 02, అబ్డాలా) వ్యాక్సిన్ల సామర్ధ్యం రేటు దాదాపు 90 శాతంగా వుంది. కేవలం వారాల వ్యవధి లోనే 20 శాతానికి పైగా క్యూబన్లకు వ్యాక్సిన్లను వేశారు. క్యూబా ఈ వ్యాక్సిన్లను, వాటి ఉత్పత్తిని పలు లాటిన్‌ అమెరికా దేశాలతో పంచుకుంది. తన విప్లవ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంది. ఈ చర్యలన్నీ చూస్తుంటే, వాస్తవంగా క్యూబా ఎంత విశాలంగా వుందో, అమెరికా ఎంత చిన్నదిగా వుందో తెలుస్తోంది!

ఇటువంటి ఆదర్శప్రాయమైన, నిస్వార్ధ దేశంపై అమెరికా దాడి చేస్తోంది. దాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తోంది. క్యూబా పట్ల ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ఆంక్షలను రద్దు చేస్తామని తన ఎన్నికల ప్రచారం సందర్భంగా వాగ్దానం చేసిన బైడెన్‌ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. తన ముందున్న ట్రంప్‌ వేటినైతే ఆచరించారో అవే విధానాలను కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా, అమెరికా అధ్యక్షుడుగా ఎవరు వచ్చినా, క్యూబా పట్ల అనుసరించే విధానం మాత్రం మారడం లేదు. ''క్యూబా ఆర్థిక జీవనాన్ని బలహీనపరిచేందుకు సాధ్యమైన ప్రతి ఒక్క మార్గమూ కచ్చితంగా అనుసరించాలి. ప్రజల్లో ఆకలిదప్పులు, నిరాశా నిస్పృహలు పెరిగి, ప్రభుత్వాన్నే కూల దోసేందుకు గానూ క్యూబాకు ధనం, సరఫరాలు నిరాకరించే విధానం అనుసరించాలి'' అని 1960లో విడుదలైన అమెరికా మెమోరాండం 499 పేర్కొంటోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో నిమిత్తం లేకుండా అన్ని అమెరికా ప్రభుత్వాలకు ఇదొక మార్గనిర్దేశంగా వుంది. గత 60 ఏళ్ళుగా క్యూబా లోని విప్లవకర ప్రభుత్వానికి అంతర్గత మద్దతును దూరం చేయడానికి వారు విఫల యత్నాలు చేస్తూనే వున్నారు. ఆర్థిక అసంతృప్తి, ఇబ్బందుల ప్రాతిపదికన ప్రజల్లో అసమ్మతి సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. తాజాగా ఆ దిశగా జరిగిన వారి ప్రయత్నాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం.

'ప్రభుత్వ మార్పు' ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కరోనా కాలమే సరైన సమయమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పచ్చి అబద్ధాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ అసత్యాలను ప్రచారం చేస్తూ, ఆటోమేటెడ్‌ సైట్లలో వందలు, వేల సంఖ్యలో ట్వీట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. విప్లవానికి మద్దతుగా జరుగుతున్న ప్రదర్శనలను కూడా విప్లవ వ్యతిరేక ప్రదర్శనలుగా చూపెడుతున్నారు. విప్లవానికి మద్దతుగా వేలాదిమంది ప్రజలు పాల్గంటున్న ఫొటోలను, తాము ప్రచారం చేస్తున్న అబద్ధాలను రుజువు చేసుకోవడానికి చాలా తెలివిగా వాడుకుంటున్నారు. ఈ తరహా పరిస్థితిని క్యూబాపై సాగించే సాంప్రదాయేతర యుద్ధంగా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ అభివర్ణిస్తున్నారు.

అసత్యాలను ప్రచారం చేయడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి వేల సంఖ్యలో తప్పుడు అకౌంట్లను ఎలా సృష్టించారో, వాటిని ఎలా నిర్వహిస్తున్నారో అనేకమంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, ఇంటర్‌నెట్‌ నిపుణులు రుజువు చేశారు. ఈ పరిణామాలన్నింటిపై స్పందించిన క్యూబా ప్రభుత్వం, క్యూబా కమ్యూనిస్టు పార్టీలు విప్లవానికి మద్దతుగా ప్రజలను నమీకరిస్తున్నాయి. ఒక వర్గం ప్రజలు నిజాయితీగా తమ ఇబ్బందులను వెలిబుచ్చుతున్నారు. వారితో మాట్లాడి, ఒప్పించాల్సిన అవసరం వుంది. మరోవైపు, అమెరికా విధ్వంస ప్రాజెక్టును కొనసాగించే వారు కొందరున్నారు. ఈ విప్లవ ప్రతీఘాత శక్తులను కఠినంగా, కచ్చితంగా ఎదుర్కొనాల్సి వుంది. ''విప్లవం నిజమైన సంభాషణ వంటిది. అసభ్యత, వక్రబుద్ధి ముందు వాస్తవం, నైతిక విలువలను వుంచుతుంది. ఇది, దాని ఉనికిపై చర్చలు జరపదు, కిరాయి మూకలను చట్టబద్ధం చేయదు, దృఢత్వంతో, భద్రతతో పని చేస్తుంది.'' అని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

క్యూబాకు సంఘీభావం పునరుద్ఘాటించిన దేశాల్లో చైనా, రష్యా, వెనిజులా, బొలీవియా, నికారాగ్వా, అర్జెంటైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు వున్నాయి. అమెరికా విధ్వంసకాండ చర్యలను ఖండించాయి. వెంటిలేటర్లు, మందులు, పిపిఇ కిట్‌లు, మాస్కులు, కోవిడ్‌ను నివారించే ఇతర మందులు వంటి వాటిని సరఫరా చేయడం ద్వారా చైనా అందించిన సాయాన్ని క్యూబన్‌ అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రజలు టన్నుల కొద్ది బియ్యాన్ని క్యూబా ప్రజలకు పంపారు.

అనేక ప్రజా సంఘాలు, ప్రముఖులు తమ సంఘీభావాన్ని తెలిపారు. భారత ప్రభుత్వం మారిన తన స్వభావానికి అనుగుణంగా ఇంతవరకు స్పందించలేదు.

అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని బట్టబయలు చేస్తూ, సోషలిస్టు క్యూబాకు సంఘీభావం ప్రకటించడమే మనం ఇప్పుడు చేయాల్సింది. వివిధ దేశాల్లో సంఘీభావ చర్యలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మనం కూడా వారితో చేతులు కలపాలి.

క్యూబాపై ఉధృతమైన అమెరికా దాడులు

 

 

 

 

(వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు)