క్యూబాలో ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలు ఈ చిన్న దీవిని అస్థిరపరిచేందుకు అమెరికా సాగిస్తున్న కుట్రలను మరోసారి బయటపెట్టాయి. గత ఆరు దశాబ్దాలుగా క్యూబాపై రుద్దుతూ వస్తున్న ఆర్థిక దిగ్బంధనానికి ముగింపు పలకాలంటూ ఐక్యరాజ్యసమితి పదే పదే తీర్మానాలు చేస్తున్నా అగ్రరాజ్యం లెక్కచేయడం లేదు. ఇతర దేశాల స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా మోతెక్కించిన బైడెన్ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. క్యూబాలో సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసేందుకు కిరాయిమూకలను ఎగదోస్తున్నాడు. క్యూబాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పశ్చిమ రాష్ట్రమైన ఆర్టెమిసాలోని శాన్ ఆంటోనియా డి బానోస్ ప్రాంతాన్ని అధ్యక్షుడు డియాజ్ కానెల్ సందర్శించినపుడు అమెరికా ప్రేరేపిత గ్రూపులు అలజడి సృష్టించే యత్నం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టడం, గందరగోళ పరచడం, రోడ్ల మీదకు వచ్చి వీరంగం వేయడం వంటి చేష్టలకు పాల్పడ్దాయి. అధ్యక్షుడు కానెల్ గద్దె దిగాలంటూ రంకెలేశాయి. అమెరికా నుంచి డాలర్ల మూటలు అందుకుని, క్యూబాలో అశాంతిని సృష్టించడమే వీరి పని. ఈ కిరాయి మూకలు సాగించే అరాచకాలకు ఆజ్యంపోసేలా పాశ్చాత్య మీడియా రకరకాల కథనాలను వండి వార్చుతోంది. 1.3 కోట్ల జనాభాకలిగిన క్యూబాలో ప్రజలు ఆకలి, పేదరికంతో దుర్భర జీవితం గడుపుతున్నారని, దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వ అరవయ్యేళ్ల పాలనే కారణమంటూ విషం కక్కుతోంది. క్యూబాలో ప్రాణాధార మందుల ముడి సామగ్రి, వైద్య పరికరాల కొరతకు అమెరికా అరవై యేళ్లుగా కొనసాగిస్తున్న అమానవీయ ఆర్థిక, వాణిజ్య ఆంక్షలే కారణం. 1959లో క్యూబా సోషలిస్టు రాజ్యంగా అవతరించినప్పటి నుండి ఆ దేశాన్ని అస్ధిరపరిచేందుకు అగ్రరాజ్యం కుట్రలు మీద కుట్రలు పన్నుతూనే ఉంది. క్యూబా అధ్యక్షుడు ఫైడల్ కాస్ట్రోపై అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ 634 సార్లు హత్యాయత్నాలు చేసింది. క్యూబాను ఆర్థికంగా దెబ్బతీసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తిని ఆసరా చేసుకుని అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రబుద్ధితోనే 1960లో హెల్మ్స్ బర్టన్ యాక్ట్ కింద ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. 2014లో బరాక్ ఒబామా ప్రభుత్వం దిగిపోయే ముందు క్యూబాపై ఆంక్షలను కొంతమేర సడలిస్తూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తరువాత వచ్చిన ట్రంప్ ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి అదనంగా మరో 243 ఆంక్షలను జోడించాడు. ఇన్ని ఆంక్షలమధ్య కూడా క్యూబా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన రెండు వ్యాక్సిన్‌లను సొంతంగా తయారు చేసుకోగలిగింది. అమెరికా మాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తే, మేము ఆ దేశానికి వ్యాక్సిన్లు అందించడం ద్వారా బదులిస్తాం అని చెప్పడం క్యూబా ఉదాత్తతకు నిదర్శనం. కోవిడ్ సమయంలో 23 దేశాలకు రెండు వేల మంది వైద్యులను, నర్సులను పపింది. గత అరవై ఏళ్లలో 160దేశాలకు 4లక్షలమంది వైద్యసహాయక సిబ్బందిని పంపి ప్రపంచ మానవాళి పట్ల, మానవ హక్కుల పట్ల క్యూబా తన నిబద్ధ్దతను చాటుకుంది. అమెరికా ప్రపంచానికి బాంబులు ఎగుమతి చేస్తే, క్యూబా డాక్టర్లను ఎగుమతి చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి విపత్తు వచ్చినా అక్కడి ప్రజలను ఆదుకోవడంలో క్యూబా ముందుంటుంది. 2021 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి క్యూబాకు ఇవ్వాలని పలు దేశాధినేతలు ప్రతిపాదించారు. క్యూబా కృషిని ఎంతగానో కొనియాడిన అంతర్జాతీయ సమాజం, నేడు ఆ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలపైనా అదే రీతిలో స్పందించాల్సిన అవసరముంది.
నిరంతర కుట్రలు, యుద్ధాలు, ఘర్షణల ద్వారా మానవాళి పాలిట శత్రువుగా నిలిచిన అమెరికా క్యూబా లోని విప్లవ ప్రతీఘాత శక్తులను స్వేచ్ఛావాదులుగా కీర్తించడంలో ఆశ్చర్యం లేదు. పాశ్చాత్య మీడియా దీనికి వంత పాడడం దాని వర్గ నైజాన్ని తెలియజేస్తోంది. విప్లవ ప్రతీఘాత శక్తుల చర్యలను విప్లవకరమైనవిగా చూపేందుకు ఆరాటపడుతున్న ఈ ప్రచార బాకాలకు, క్యూబా విప్లవాన్ని కాపాడుకునేందుకు అక్కడి ప్రజలు దేశవ్యాపితంగా అన్ని ప్రధాన నగరాల్లోను చేసిన ప్రదర్శనలు కనపడలేదా? క్యూబా ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని రష్యా, మెక్సికో, చైనా లాటిన్ అమెరికాతో సహాలు పలు దేశాలు ఇప్పటికే ఖండించాయి. క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ నిలవాలి. క్యూబాపై ఆర్థిక దిగ్బంధనానికి వ్యతిరేకంగా గట్టిగా గళమెత్తాలి.










