బుల్లీ బారు యాప్ పేరుతో వెలుగు లోకి వచ్చిన వికృత చేష్టలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టడం వంటి చర్యలు దారుణం! ఒక మతానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకోవడం, వారిలో కూడా అభ్యుదయ భావాలతో అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించే వారినే వేధింపులకు గురి చేయడం వంటి చర్యలనుబట్టి ఇది ఒక పథకం ప్రకారం కుట్ర పూరితంగా జరిగిందని స్పష్టమౌతోంది. దేశమంతా గగ్గోలు పెట్టిన తరువాత ఒకరిద్దరిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అంతమాత్రం చేత ఒరిగేదేమి లేదు. వీరి వెనుక ఉన్నదెవ్వరో నిగ్గు తేల్చాలి. వారిని ప్రజల మందు దోషులుగా నిలబెట్టాలి, మరోసారి ఈ తరహా దుశ్చర్యలకు దిగకుండా కఠిన శిక్షలు విధించాలి. కొద్దిమందిని లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో ఈ తరహా వేధింపులకు దిగడం ఇదే మొదటిసారి కాదు! ఆరు నెలల క్రితమే ఈ తరహా వికృత చర్యలకు దిగారు. బాధిత మహిళలు అప్పుడే కేసు పెట్టినప్పటికీ దర్యాప్తు సంస్థల్లో నామమాత్రపు చలనం కూడా కనిపించలేదు. మహిళల రక్షణకు, భద్రతకు ఎన్నో చట్టాలు తెచ్చామని, ఆధునిక సాంకేతికతను వినియోగించి ఎన్నో సదుపాయాలు కల్పించామని కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటూ ఉన్నా ఆరు నెలల కిందటి ఫిర్యాదులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదెందుకో? దర్యాప్తు సంస్థల ఈ నిష్క్రియాపరత్వం కేవలం యాదృచ్ఛికమా? మరేదైనా కారణం ఉందా? ఇప్పుడైనా దర్యాప్తు ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగుతుందా? వికృత చేష్టల వెనుక ఉన్న దెవరో తేల్చగలరా ?
నిజానికి కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక వ్యూహం ప్రకారం దేశంలో విద్వేష పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సంఫ్‌ుపరివార్ శక్తులు ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా బాహాటంగానే మెజార్టీ ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నాయి. దాడులకు తెగబడుతున్నాయి. వివిధ సామాజిక అంశాలపై గళమెత్తే మహిళలు, దళితులతో పాటు ఇతరులను కూడా ఈ విద్వేష శక్తులు వదలడం లేదు. అయినా, దేశ వ్యాప్తంగా ప్రశ్నించే గొంతులు వినపడుతూనే ఉన్నాయి. హింసను, దాడులను ప్రతిఘటిస్తూ ఆ గొంతులు సంఘటితమవుతున్నాయి. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో సమత, మమతను పెంచడానికి, మూఢత్వం స్థానంలో చైతన్యాన్ని నింపడానికి అప్రకటిత నిర్బంధాన్ని ఛేదించుకుని మరీ నినదిస్తున్నాయి. ఇలా స్వాభిమానంతో, సమరశీలంగా నినదించే అభ్యుదయ ముస్లిం మహిళలు, సామిజికవేత్తలు, రచయితలు, జర్నలిస్టుల ఫోటోలే ఆన్‌లైన్ వేలంపాటలో ప్రత్యక్షం కావడం వెనుక ఏ కుట్ర లేదంటే నమ్మలేం! ఆ కుట్రను వెలికితీసి దేశ ప్రజల ముందు ఉంచే నిజాయితీ ఉందా లేదా అన్నదే ప్రశ్న! 'మమ్మల్ని అంగడి సరుకుగా చిత్రీకరించవచ్చు. పరువు ప్రతిష్టలను దెబ్బతీయవచ్చు. కానీ, పోరాడాలన్న మా తపనను, నిజాలను ప్రజలకు చెప్పాలన్న ఆకాంక్షను ఈ తరహా చర్యలతో ఆపలేరు. మేం భయపడం' అని ఈ వికృత చర్యలపై ఫిర్యాదు చేసిన ఒక మహిళ అన్నారు. ఆమెదే కాదు. వికృత చేష్టలకు గురైన వందమంది మహిళలది ఇదే మాట! వేధింపులకు గురైన మహిళలు దృఢంగానే ఉన్నారు. మరి, అంతే దృఢంగా వికృత చేష్టల వెనుక ఉన్న దుష్ట శక్తులను దర్యాప్తు సంస్థలు దేశ ప్రజల ముందు ఉంచగలవా ?
ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 18 ఏళ్ల యువతిని, 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరిది ఉత్తరాఖండ్ కాగా, మరొకరిది కర్నాటక. ఈ వికృత నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో, మరెందరికి దీనిలో భాగస్వామ్యం ఉందో ఇప్పుడే చెప్పలేం! కానీ, దేశ నిర్మాణానికి, ప్రగతికి బాటలు వేయాల్సిన యువశక్తి ఉన్మాదపు ముసుగులో ఎలా చిక్కుకుంటోందో చెప్పడానికి ఇదో ఉదాహరణ! నవశక్తులు, యువశక్తులు ఇలా నిర్వీర్యం అవుతుంటే, ఉన్మాదం తలకెక్కించుకుంటూ ఉంటే సమాజం చూస్తూ ఊరుకోదు. మౌఢ్యాన్ని ఎదిరించి రుజుమార్గంలో నడపాలి. దుష్ట శిక్షణ జరగాలి.










