Dec 29,2021 09:16
  • సమరోత్సాహానికి ఊతమిచ్చిన చర్చలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) : కష్ట జీవులకు ఎల్లప్పుడూ ఎర్ర జెండా అండగా నిలిచిందని, సమస్యలపై వివిధ వర్గాల, రంగాల ప్రజలను సమీకరించి పోరాట బాట పట్టించిందని సిపిఎం రాష్ట్ర మహాసభ చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు స్ఫూర్తినిచ్చారు. ఇక్కడ జరుగుతున్న సిపిఎం 26వ రాష్ట్ర మహాసభ రెండవ రోజు మంగళవారం రంగాల వారీ కార్యకలాపాలపై ప్రతినిధులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.
 

                                           బిజెపిని దోషిగా నిలబెట్టిన 'ఉక్కు' సంకల్పం

కార్మిక రంగం నుండి కందారపు మురళీ, బేబి రాణి... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తూ సాగుతున్న పోరాటం చారిత్రాత్మకం. రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిన కేంద్ర బిజెపిని రాజకీయంగా ఒక మూలకు నెట్టి దోషిగా నిలబెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 16 వేల మంది కాంట్రాక్టు కార్మికుల పోరాటంలో వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్బంధానికి ఒడిగట్టినా బెదరలేదు. కార్పొరేట్‌ దిగ్గజం ఎల్‌జి పాలిమర్స్‌్‌లో నిర్వహించిన పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వైసిపి ఎంపి విజయసాయిరెడిక్డి కంటిపై కునుకు లేకుండా చేసింది శ్రీకాకుళంలో 'అరబిందో' పోరాటం. ఎన్నడూ లేని విధంగా కార్మిక పోరాటాలపై ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతోంది. పెట్రోలు, డీజిల్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా ట్రాన్స్‌పోర్టు కార్మికులు, ఇసుక సమస్యపైనా, సంక్షేమ బోర్డు కోసం భవన నిర్మాణ కార్మికులు, స్కీం వర్కర్లు, ఆందోళనలు చేశారు. విద్యుత్‌ కార్మికులు పోరాడి వేతనాలు పెంచుకున్నారు. మున్సిపల్‌, పంచాయితీ పారిశుధ్య కార్మికులు ఆందోళనలు చేశారు. కరోనా సమయంలో రూ.3 కోట్లు సేకరించి 1.60 లక్షల మంది కార్మికులు, వలస కార్మికులకు సహాయపడ్డాం.
 

                                                            భూమి కోసం పోరు

వ్యవసాయ కార్మిక సంఘం నుండి రాణి, లింగన్న.. భూ పంపిణీ కోసం అనేక పోరాటాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పంచాలని పోరాటం సాగుతోంది. లాఠీ ఛార్జీలు, అక్రమ కేసులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతి భూపోరాటాల్లో యువత పెద్ద ఎత్తున కదిలారు. కరోనా సమయంలో ఉపాధి హామీ పనుల కోసం, సత్తెనపల్లి, బేతంచర్ల, పిడుగురాళ్ల, నంద్యాలలో కూలి పోరాటాలు జరిగాయి. కార్మికులు కూలి పెంచుకున్నారు. ముఖ్యమంత్రి జిల్లా కడపలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. సంక్షేమ పథకాలు కాకుండా భూములు పంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా సమయంలో వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులకు సహాయపడ్డాం. కర్నూలు, తిరుపతి, గుంటూరులో సామాజిక అంశాలపై ఆందోళనలు జరిగాయి.
 

                                                        కౌలు రైతులపై కేంద్రీకరణ

కౌలు రైతుల నుండి లక్ష్మణ్‌ స్వామి, రాధాకృష్ణ... రైతుల్లో 70 శాతం కౌలు రైతులే. విపత్తులు, కల్తీ విత్తనాల వలన కౌలు రైతులే సమిధలవుతున్నారు. ఆత్మహత్యల బాట పడుతున్నారు. కౌలు రైతుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ డిమాండ్‌ను ముందుకు తెచ్చాం. గత ప్రభుత్వంలో రుణమాఫీపై పోరాడి రూ.350 కోట్ల మాఫీ సాధించాం. అన్నదాత సుఖీభవలో కౌలు రైతులకు ప్రభుత్వం సహాయం ఇవ్వనంటే ఉద్యమించాం. పోరాటాల ద్వారా తెచ్చుకున్న 2011- ఎల్‌ఇసి చట్టాన్ని వైసిపి ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా తెచ్చిన సిసిఆర్‌సి చట్టం కౌలు రైతులకు ఇబ్బందికరం. మార్కెట్‌ సమస్యపై పోరాటాలు చేశాం. కాకినాడ- గుంటూరు కమిషనరేట్‌ వరకు పాదయాత్ర, కృష్ణాలో కల్తీ మిర్చినారుపై ఆందోళనలు జరిగాయి. కేంద్ర నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాం.
   

                                               ఢిల్లీ రైతు పోరాటం ఉత్తేజాన్నిచ్చింది

రైతు రంగం నుండి హేమలత, నరసింహారావు... నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ రైతు ఉద్యమం ఉత్తేజాన్నిచ్చింది. రాష్ట్రంలో 42 సంఘాలను నిలబెట్టడంలో ప్రధాన భూమిక పోషించాం. కరోనా కాలంలోనూ భూ సేకరణ సమస్యపై పోరాటాలు చేసి రైతులకు పరిహారం ఇప్పించాం. మార్కెట్‌ సమస్యపై బత్తాయిలకు ధర కోసం నెల్లూరు, పశ్చిమగోదావరిలో, మామిడికి ధర పెంచాలని చిత్తూరులో, నిమ్మకు ధర పెంచాలని పశ్చిమగోదావరిలో, ఉల్లి కొనుగోళ్లకు కర్నూలులో, పసుపు కొనుగోలు కేంద్రాల కోసం గుంటూరులో ఆందోళనలు జరిగాయి. చెరకు రైతుల బకాయిలు, సుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు నిర్విరామంగా పోరాటాలు సాగుతున్నాయి. అనంతపురంలో సాగు తగ్గుదలపై అధ్యయనం చేసి పాదయాత్ర నిర్వహించాం. అదే జిల్లాలో సాగునీటి కోసం, పశ్చిమ కృష్ణాలో నకిలీ విత్తనాలపై ఆందోళనలు జరిగాయి.
 

                                                              సేవ-పోరాటం

ఉపాధ్యాయ రంగం నుండి ప్రసాద్‌, వెంకటేశ్వర్లు.. సిపిఎస్‌ రద్దు, ఉద్యోగులకు పిఆర్‌సి, డిఎ బకాయిల కోసం ఆందోళనలు చేశాం. సిపిఎస్‌ రద్దు కోరుతూ 1.26 లక్షల మంది మాస్‌ క్యాజువల్‌ లీవ్‌లు పెట్టి పోరాటంలో పాల్గొన్నారు. జీపు, పాదయాత్రలు జరిగాయి. మున్సిపల్‌, గిరిజన ఉపాధ్యాయుల సమస్యలపై, యాప్‌ల రద్దు, ఎయిడెడ్‌ రద్దు, స్కూళ్ల విలీనంపై ఆందోళనలు జరిగాయి. కరోనా సహాయం, ఐసొలేషన్‌ సెంటర్లకు తోడ్పాటిచ్చాం.
 

                                                   ఎందుకూ కొరగాని కార్పొరేషన్లు

వృత్తిదారుల నుండి భాస్కరయ్య, బాలకృష్ణ... వృత్తులను విడదీసి కులాలవారీగా ప్రభుత్వం వేసిన 56 కార్పొరేషన్లు దండగ. కృష్ణా జిల్లా నాగాయలంకలో రక్షణ రంగం కోసం మత్స్యకారుల భూములు తీసుకుంటే పోరాడి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాం. చేపలను సచివాలయాల్లో ప్రభుత్వం అమ్ముతామంటే ఆందోళనలు చేశాం. విశాఖలో ఎన్‌సిడిసి నుండి రూ.9 కోట్ల రుణాలిప్పించాం. చేయుత, చేదోడు కోసం, చెరువులు, సామాజిక స్థలాల ప్రైవేటీకరణను వ్యతిరేకించాం. సామాజిక దాడులపై పోరాడాం. కరోనా సమయంలో రజక వృత్తిదారులకు రూ.10 వేలు సహాయం చేయాలని ఆందోళనలు చేశాం.