Jul 07,2021 18:10

అమరావతి : కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో సిఎం జగన్‌ విఫలమయ్యారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు పంట బకాయిలను వెంటనే చెల్లించాలని, రైతు ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మోటార్లకు మీటర్లు బిగించే పథకం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ మద్దతు ధర లభించడం లేదన్నారు. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి ఒక్కో రైతుకు రూ.13,500 ఇస్తామని చెప్పి.. రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రాయలసీమలో రాయితీపై పంపిణీ చేసే డ్రిప్‌, యంత్ర పరికరాలను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలవడం సిఎం జగన్‌ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. కృష్ణా, గోదావరి నీటి హక్కులను తాకట్ట పెట్టకుండా కాపాడాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌ పెంచాలని డిమాండ్‌ చేశారు.