Aug 04,2020 08:29

రాష్ట్రంలో కోవిడ్‌-19 ఉధృతి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. మొదట కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు అక్కడ ఇక్కడ, పల్లె పట్నం అనే భేదం లేకుండా విస్తరిస్తున్నాయి. మొన్నటి వరకు ఒక్క పాజిటివ్‌ లేని గ్రామాల్లో పదుల సంఖ్యల్లోకి చేరడం మిక్కిలి ఆందోళనకరం. కేసుల పరంగా దేశంలోని రాష్ట్రాల్లో ఎడెనిమిది స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఢిల్లీని దాటేసింది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మనమే. పది రోజులుగా ప్రతి రోజూ ఏడు నుంచి పది వేల కొత్త కేసులొస్తున్నాయి. దాంతో స్వల్ప సమయంలోనే లక్షన్నర మార్క్‌ను ఎ.పి క్రాస్‌ చేసింది. మరణాలు రోజుకు యాభైకి ఏమాత్రం తగ్గకపోవడం ప్రజలను మరింత భయపెడుతోంది. ఆర్‌టిపిసిఆర్‌, ట్రూనాట్‌, నాక్‌, ర్యాపిడ్‌యాంటిజెన్‌ అన్నీ కలుపుకొని రోజుకు అర లక్ష, ఆపైన పరీక్షలు చేస్తున్నామంటోంది ప్రభుత్వం. దాని ప్రకారం చూసినా పరీక్షలు చేయించుకున్న వారిలో 16 శాతం వరకు పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నాయి. తాము అధికంగా టెస్టులు చేస్తున్నందున కేసులు పెరుగుతున్నాయనే సర్కారు వాదనలో వాస్తవం పాక్షికమే. మనకు ముంబయి, చెన్నయి వంటి మహానగరాలు లేకపోయినా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఇప్పటికీ కంటైన్‌మెంట్‌ జోన్లలోనూ అందరికీ టెస్టులు చేయట్లేదు. కేవలం లక్షణాలున్నవారికే చేస్తున్నారు. వీలైన మేరకు పరీక్షలు పెంచడం ద్వారా ప్రైమరీ, సెకండరీ, కాంటాక్ట్‌ వ్యక్తులను గుర్తించి ఐసొలేషన్‌కు పంపడం ద్వారా సంక్రమణను అరికట్టాలని డబ్ల్యుహెచ్‌ఓ సహా పలు సంస్థలు నొక్కివక్కాణిస్తున్నాయి. కాగా ప్రభుత్వ గణాంకాల్లోకి ఎక్కని పాజిటివ్‌ కేసులు, మరణాలు చాలానే ఉన్నాయన్న ఆరోపణలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు.
కోవిడ్‌ వ్యాధిగ్రస్తుల చికిత్సకు సకల ఏర్పాట్లూ చేసేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, క్షేత్ర స్థాయిలో అది కనిపించట్లేదు. సరిపడినన్ని అంబులెన్స్‌లు వున్నాయనగా మొన్న చెత్త రిక్షాలో కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలించగా, నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కోవిడ్‌ పేషెంట్లను పంచాయతీ చెత్త ట్రాలీలో తరలించిన ఉదంతాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. గుంటూరు జనరల్‌ హాస్పిటల్‌లో బెడ్లు లేక స్ట్రెచర్‌ పైనే రోగికి చికిత్స చేయడం సర్కారీ దవాఖానాల దయనీయతకు అద్దం పడుతుంది. కర్నూలులో ఆక్సిజన్‌ అందుబాటులో లేక మరణాలు సంభవించాయి. కోవిడ్‌ ఆస్పత్రుల్లో, కేర్‌ సెంటర్లలో కనీస వసతులు, శానిటేషన్‌, నాణ్యమైన భోజనం అందట్లేదని స్వయంగా ఆరోగ్య మంత్రి నిర్వహించిన తనిఖీల్లో బయట పడ్డాయి. టెస్టు శాంపిళ్లు సేకరించాక ఫలితాలు ఆలస్యం అవుతుండటం వైరస్‌ వ్యాప్తికి ఒక కారణం. అసలే వైరస్‌ సోకిందంటేనే ఆందోళన పెరిగిపోతున్న జనానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఠారెస్తున్నాయి. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు లక్షలకు లక్షలు దోచుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీలో కోవిడ్‌ను చేర్చినా వైద్యం చేయట్లేదు. ప్రైవేటు దోపిడీపై ప్రభుత్వానికి ఉత్తుత్తి ఘీంకారాలే తప్ప ఎక్కడా చర్యలూ లేవు, నియంత్రణా లేదు.
కరువొచ్చినప్పుడు బావి తవ్వనారంభించడం పాలకులకు అలవాటే. కోవిడ్‌ మహమ్మారిగా రూపుదాల్చాక ఇప్పుడు డాక్టర్లు, పారామెడికల్‌, నర్సింగ్‌, పారిశుధ్య సిబ్బంది నియామకాలకు దిగింది ప్రభుత్వం. అదీ పర్మినెంట్‌ కాదని, ఆర్నెల్ల వరకేనని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆర్నెల్ల భాగ్యానికి ఎందుకులే అని అభ్యర్ధులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కాగా డాక్టర్లు, సిబ్బంది అక్కడక్కడ వైరస్‌ బారిన పడుతుండటంతో పని చేస్తున్న వారిలో భయం, దానికి తోడు పని ఒత్తిడి పెరుగుతోంది. తట్టుకోలేక పలు చోట్ల సిబ్బంది ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. ఈ గుణపాఠాలతోనైనా ప్రభుత్వ అధీనంలో వైద్య, ఆరోగ్య రంగం మెరుగుదల తమ ప్రాధాన్యతగా ఉండాలని సర్కారు గుర్తించాలి. ఆరోగ్యశ్రీ వంటివి కొన్ని వ్యాధులకు, కొందరు ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. సర్వజనీన శాశ్వత పరిష్కారం ఉత్తమమైన సర్కారీ వైద్యమే. తక్షణం కోవిడ్‌ విజృంభణను అరికట్టేందుకు, వ్యాధిగ్రస్తుల వైద్య చికిత్సకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కదలాలి. కేంద్రం నుంచి నిధులు సాధించాలి.