ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: ఆచరణాత్మకమైన నైపుణ్యాత్మక శిక్షణ పొందడం ద్వారా రోగులకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో మరింత నమ్మకాన్ని పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు సూచించారు. డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు స్థానిక సిద్దార్థ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జ్వోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 23 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 257 కమ్యూనిటీ హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు ద్వారా గ్రామ స్థాయి నుండి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా 257 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోగులకు సేవలందించడం జరుగుతుందన్నారు. రోగులకు ప్రధమ చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుండి రక్షిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ఒక విధంగా డాక్టర్లతో సమానంగా భావించాల్సి ఉంటుందన్నారు. నర్సింగ్ విద్యను అభ్యసించి శిక్షణ పొందిన సమయంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రాధమిక చికిత్సపై పూర్తి అవగాహన ఉన్నప్పటికి వైద్య విధానంలో వస్తున్న నూతన పోకడల పై మరింత అవగాహన కల్పించుకుని రోగులకు చికిత్స అందించగలిగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ప్రాధమిక చికిత్సపై అవగాహన కల్పించే బుక్‌లెట్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా. యం సుహాసిని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెెండెెంట్ డా. బి సౌభాగ్యలక్ష్మి, సిద్దార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.కె. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










