ప్రజాశక్తి- అమరావతి : కమ్యూనిస్టు ఉద్యమాలు పురరేకీకరణ కావాల్సిన సమయం వచ్చిందని, అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఒకే జెండా కిందకు రావాలని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ ఆకాంక్షించారు. సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందని తెలిపారు. స్వాతంత్య్రానంతరం ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. దేశాభివృద్ధి నిరోధక, మతోన్మాద, కార్పొరేట్ పక్షపాత ప్రభుత్వంగా బిజెపి పాలన చేస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తోందని, పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఎపిలో ప్రజా సమస్యలపై సిఎం అర్జీలు కూడా తీసుకోలేని పరిస్థితులున్నాయని తెలిపారు. ఇటువంటి కిష్టతరమైన పరిస్థితుల్లో కమ్యూనిస్టులంతా ఏకంకావాలని కోరారు. కలిసొచ్చే సంఘాలను కలుపుకుపోవాల్సి ఉందన్నారు. కేంద్రంలోని మోడీని గద్దె దించేందుకు ఐక్యపోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. 2022 అక్టోబర్‌లో సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో జరగనున్నాయని, ఈలోపు కమ్యూనిస్టులంతా ఏకంకావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సభాధ్యక్షులు సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద ప్రభుత్వాన్ని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సిపిఎం ఎప్పుడూ ముందు ఉంటుందని భరోసా ఇచ్చారు.










