ప్రజాశక్తి-జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్ (తాడేపల్లి):కమ్యూనిస్టు ఉద్యమాలు పునరరేకీకరణకు కావాల్సిన సమయం వచ్చిందని, అన్ని కమ్యూనిస్టు పార్టీలూ ఒకే జెండా కిందకు రావాలని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ ఆకాంక్షించారు. సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. అభివృద్ధి నిరోధక, మతోన్మాద, కార్పొరేట్ పాలన బిజెపి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తోందని, పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిలో ప్రజా సమస్యలపై సిఎం అర్జీలు కూడా తీసుకోలేని పరిస్థితులున్నాయని తెలిపారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కమ్యూనిస్టులంతా ఏకంకావాలని కోరారు. కలిసొచ్చే సంఘాలను కలుపుకుపోవాల్సి ఉందన్నారు. కేంద్రంలోని మోడీని గద్దె దించేందుకు ఐక్యపోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. 2022 అక్టోబరులో విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈలోపు కమ్యూనిస్టులంతా ఏకంకావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సభాధ్యక్షులు సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు మాట్లాడుతూ, కేంద్రంలోని మతోన్మాద ప్రభుత్వాన్ని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సిపిఎం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు.










