Aug 11,2020 08:03

కోవిడ్‌-19 ఉధృతితో ప్రజలు భయకంపితులవుతుండగా, బెజవాడలో ఒక హోటల్‌లో ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ దుర్ఘటనలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న దశలో ఉన్న పది మంది మృత్యువాతపడ్డారు. మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో అగ్ని కీలలకు ఆహుతైన వారు కొందరైతే, పొగ వలన ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినవారు మరికొందరు. విషాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సి.ఎం సహా పలువురు దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీసేందుకు వైద్య ఆరోగ్యశాఖ, హోం శాఖ వేర్వేరుగా కమిటీలను వేశాయి. 48 గంటల్లో నివేదిక ఇమ్మన్నాయి. ఆస్పత్రి, హోటల్‌ యాజమాన్యాలపై పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక సమాచారం మేరకు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రిదే ప్రధాన బాధ్యతని హెల్త్‌ మినిస్టర్‌ స్పాట్‌లోనే చెప్పారు. కోవిడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్న హోటల్‌కు అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవని ఫైర్‌ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. హోటల్‌ బిల్డింగ్‌లో సదుపాయాలు, భద్రత, నిర్వహణ వ్యవహారాల బాధ్యత సదరు హోటల్‌ మేనేజ్‌మెంట్‌దేనని, తమది కేవలం వైద్య సంబంధ చికిత్సలకే పూచీ అని కార్పొరేట్‌ ఆస్పత్రి వాదిస్తోంది. వీరి సంవాదం చూస్తుంటే...గత ప్రమాదాలకు మల్లే, వేడి తగ్గించేందుకు హడావిడి చేసి, తూతూ మంత్రపు విచారణలతో సరిపెట్టి, ఆపై అసలు వాస్తవాలను కాలగర్భంలో కలిపేలా గోచరిస్తోంది.
దేశంలో మరెక్కడా చేయని విధంగా కోవిడ్‌ టెస్టులు చేస్తున్నామంటున్న ప్రభుత్వం, వ్యాధిగ్రస్తులకు సరైన సమయంలో సరైన చికిత్స అందించే విషయంలో పక్కా ప్రణాళిక, వ్యూహం లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని అధికారులు కాగితాలపై ఆదేశాలివ్వడం మినహా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పట్టించుకోవట్లేదు. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులకు అనుమతులిస్తున్న ప్రభుత్వం తనిఖీలు, అజమాయిషీలను తుంగలో తొక్కుతోంది. ఆ పర్యవసానమే బెజవాడ దుర్ఘటన. ఎక్కడా లేని విధంగా ఎ.పి లోనే కార్పొరేట్‌ ఆస్పత్రుల దందా ఎప్పటి నుంచో సాగుతోంది. తక్కువ ఖర్చులో నయమయ్యే చిన్న వ్యాధులకు సైతం అధిక మొత్తంలో బిల్లులు పిండటం పరిపాటైంది. కోవిడ్‌ కేసుల్లో అత్యధికులకు స్వల్ప చికిత్సలు సరిపోతాయని, రిస్క్‌ కొందరికేనని డబ్ల్యుహెచ్‌ఓ, ఐసిఎంఆర్‌, ఐఎంఎ సహా పలు సంస్థలు చెబుతున్నా, కార్పొరేట్లు మాత్రం పది పన్నెండు రోజులకు ఐదారు లక్షల ఆఫర్‌ ప్యాకేజీలు అమలు చేస్తున్నాయి. కార్పొరేట్లకు అనుమతులిస్తున్న సర్కారు అవి వసూలు చేసే ఫీజుల నియంత్రణపై చేతులెత్తేయడం కార్పొరేట్‌ దోపిడీకి సహకరించమే. భయాందోళనల్లో ఉన్న ప్రజల బలహీనతను తమ కాసుల వేటకు కార్పొరేట్లు వాడుకుంటున్నా ప్రభుత్వం గుడ్లప్పగించడం ఏ సమర్ధతకు సంకేతం?
కార్పొరేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు పర్మిషన్‌ల విషయంలో ప్రభుత్వం ఎంత గుడ్డిగా వ్యవహరిస్తోందో బెజవాడ ఉదంతం తిరుగులేని సాక్ష్యం. హోటల్‌కు కనీసం ఫైర్‌ అనుమతి ఉందో లేదో కూడా చూడలేదు. అగ్నిమాపక పరికరాలు, స్మోక్‌ డిటెక్టర్లు పని చేస్తున్నాయో లేదో, అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో కనీసం పరిశీలించలేదు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను షిఫ్టు చేసేందుకు సౌకర్యవంతంగా ఉండే లిఫ్టులు, ర్యాంపులు హోటల్‌లో ఉండవు. ఆక్సిజన్‌, వెంటిలేటర్ల వంటివి లేవు. ఫైర్‌ వ్యాప్తికి కారణమైన శానిటైజర్ల నిల్వలను పట్టించుకోలేదు. చెప్పుకుంటూ పోతే బెజవాడ దుర్ఘటనలో లోపాలు చాలా చాలా ఉన్నాయి. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలి. బెజవాడ గుణపాఠంతోనైనా ప్రభుత్వ వైద్యం మెరుగుదలపై సర్కారు దృష్టి సారించాలి. కార్పొరేట్‌, ప్రైవేటు ఇష్టారీతి దోపిడీకి ముకుతాడు వేయాలి. అప్పుడే ప్రజల ఆరోగ్యానికి భద్రత. అదే ప్రభుత్వ చిత్తశుద్ధికి కొలమానం.