కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఐక్యత బలోపేతమవ్వాలి : సిపిఎం రాష్ట్ర మహాసభ ప్రారంభోత్సవ సభలో సీతారాం ఏచూరి
తాడేపల్లి (గుంటూరు) : సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సిఎస్‌ఆర్ కళ్యాణ మండపం, తాడేపల్లి బైపాస్ రోడ్డు వద్ద సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ... జాతీయ రంగంలో, అంతర్జాతీయ రంగంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. కోవిడ్ విస్తరించడానికి ముందుగానే.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరుగుతూ వచ్చిందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం తన పెత్తనాన్ని ప్రపంచ దేశాలపై చూపిస్తూ మిలటరీ జోక్యాలు చేసుకుందని ఆరోపించారు. గతంలోనూ ఇది జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా బలపడిందన్నారు. మరోవైపు.. కోవిడ్ వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రజా ఉద్యమాలు, వర్గపోరాటాలు కూడా తీవ్రంగా పెరిగాయని, అక్కడి పెట్టుబడిదారీవర్గాలు ఆ పోరాటాలపై నిరంకుశంగా దాడులు చేసి ఉద్యమాలను అణచడానికి ప్రయత్నించాయని చెప్పారు. పెట్టుబడిదారీ విధానాన్ని బలపరిచేందుకు చాలా దేశాల్లో ఫాసిస్టు శక్తులు అధికారంలోకి వచ్చాయని, అవి మరింత నిరకుంశంగా నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను అమలు చేశాయని అన్నారు. మన దేశంలో బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొడితే, అమెరికాలో ట్రంప్ రేసిజాన్ని రెచ్చగొట్టారని అన్నారు. బ్రెజిల్‌లో మితవాద నేత, ఆ దేశ అధ్యక్షుడు బల్సనారో తానోక ఫాసిస్టునని తనకు తానుగా ప్రకటించుకున్నాడని చెప్పారు. ఈ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజల మధ్య పెరుగుతున్న ఐక్యతను దెబ్బతీసేందుకు మతం, జాతి, ప్రాంతం పేరుతో విభజనలు తీసుకువస్తున్నారని అన్నారు. మన దేశంలో కూడా మతోన్మాద రాజకీయాలతోపాటు ఈ నిరంకుశ విధానం ఇంకా బలపడుతోందని ఆవేదన చెందారు. శతకోటీశ్వరుల ఆస్తులు ఇంకా పెరుగుతున్నాయని తెలిపారు. కోవిడ్‌ను తట్టుకోవడానికి ఉద్దీపన ప్యాకేజీలను ఇవ్వడం, ఆ ఉద్దీపనల ప్యాకేజ్‌ల కోసమంటూ ప్రభుత్వం బాండ్లను అమ్ముకుంటూ వనరులను సమకూర్చుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ బాండ్లను అమ్మడం మొదలయిన తరువాత స్టాక్ మార్కెట్లలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ఇలా దేశంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నాయని వివరించారు. ప్రజల్లో బతుకుదెరువు దిగజారిందని చెప్పారు. ప్రజా ఉద్యమాలను అణిచివేయడం, నిరంకుశ దాడులు చేయడం ఎలా జరుగుతోందో.. అదే స్థాయిలో ప్రపంచ ఉద్యమాలు కూడా పెరిగాయని తెలిపారు. 50 సంవత్సరాల తరువాత చిలీలో వామపక్ష నేత విజయం సాధించారని చెప్పారు. రైతాంగ పోరాటంలో కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఐక్యత ప్రముఖ పాత్ర పోషించిందని, ఈ ఉద్యమాల ఐక్యతను సిపిఎం మరింత బలోపేతం చేస్తుందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.










