ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్ ఊసే ఎత్తకుండా బిజెపి మరోమారు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. బడ్జెట్ ప్రసంగంలోనూ ఆ ఊసే లేక పోవడంతో అస్సలు విశాఖ రైల్వే జోన్ ఉన్నట్టా? లేనట్టా అనే సందేహాం వ్యక్తమవుతోంది. రాబోవు మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను నడుపుతామని చెబుతున్న ప్రభుత్వం ఎపికి ఎన్ని కేటాయిస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. 2023 నాటికి 100 శాతం రైల్వే ట్రాక్‌లను బ్రాడ్‌గేజ్ చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కష్టకాలంలోనూ వేతన జీవులను పట్టించుకోరా? : శంకరరావు
కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని, బడ్జెట్‌లో రైల్వే ఉద్యోగులకు భారంగా మారిన ట్యాక్స్‌ల మినహాయింపుల ఊసే కనబడలేదని దక్షిణ మధ్య రైల్వే మజ్ధూర్ యూనియన్ అధ్యక్షులు కె శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సిహెచ్ శంకరరావు పేర్కొన్నారు. పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలకు రాయితీలిస్తున్న కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 6 సిపిసి, 7 సిపిసి అమలు చేయడం లేదన్నారు. రైల్వే ఉద్యోగాలను భర్తీ చేస్తే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వారు పేర్కొన్నారు. గతంలో రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండటంతో ఎంపిలు తమ నియోజకవర్గంతో పాటు రైల్వే స్టేషన్ల అభివృద్ది గురించి విపులంగా మాట్లాడే అవకాశముండేదని, బడ్జెట్ అంతా ఒకటిగా కలపడంతో ఎంపిలు రైల్వే గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోతోందన్నారు.










