Nov 13,2023 21:44

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు తమ్మినేని తదితరులు

ప్రజాశక్తి-కొత్తవలస :  కొత్తవలస మండలాన్ని కాలుష్య కోరలు నుంచి రక్షించడానికి అందరూ ముందుకు రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మండలంలో సోమవారం ప్రజలను కలిసి కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చెందినప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, పాలకులు ఎన్ని మారినా ఈ ప్రాంత వాసుల తలరాత మారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. హెవీ వాహనాలు తిరగడం, పరిమితికి మించి వాహనాలు ఈ రోడ్డు గుండా వెళ్లడం వల్ల రోడ్లు పూర్తిగా పాడయ్యాయని అన్నారు. ప్రభుత్వాలకు ఆదాయం వచ్చినప్పటికీ మరమ్మతులకు నోచుకోకపోవడం విచారకరమని అన్నారు. కంటకాపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి రవాణా చేస్తున్న బొగ్గు, ఐరన్‌ ఓర్‌ వాహనాలు వల్ల రోడ్డు పూర్తిగా పాడైపోయిందన్నారు. కంటకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు రోడ్లు పూర్తిగా పాడయ్యాయని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు, చల్లా జగన్‌, గొంప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.