May 16,2023 22:49

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: కాళ్ల వాపులు, పాదాల వాపులు రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయని, వాటిల్లో సిరలు మూసుకుపోవడం వల్ల వచ్చే వాపులు కూడా ప్రధానమైనవని, వీటి చికిత్సకు ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ ఉత్తమమైన విధానమని అని ప్రముఖ ఇంటర్వెన్షనల్‌ రేడియోలజిస్ట్‌ డాక్టర్‌ యం.భవానీశంకర్‌ అన్నారు. బెంజిసర్కిల్‌ వద్ద గల వాసవ్య నర్సింగ్‌ హోమ్‌లో డాక్టర్‌ సమరం అధ్యక్షతన మంగళవారం 'కాళ్ల వాపు' అనే అంశంపై ఆరోగ్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళ్ల మీద ఉండే సిరలు వాచిపోయి పైకి ఉబ్బుగా, నీలంగా తేలినప్పుడు సాధారణంగా బరువు తగ్గమని, కంప్రెషన్స్‌ స్టాకింగ్స్‌ వేసుకోమని చెబుతారన్నారు. కాని ఇటువంటి పద్ధతి వల్ల అంతగా ప్రయోజనం కనబడదన్నారు. ఎండోవాస్క్యులార్‌ లేజర్‌ ఎబిలేషన్స్‌ కూడా కాళ్ళ మీద ఉబ్బిన సిరల వాపుకి మరొక చికిత్సగా పేర్కొంటారన్నారు. మందుల విషయం తీసుకున్నట్లయితే యాంటికోయాగ్యులేషన్‌ థెరపీ ఉపయోగించడం ఉంటుందన్నారు. కాళ్ళ లోపల సిరలలో రక్తపు గడ్డలు ఏర్పడి మూసుకుపోయినప్పుడు కాళ్ళు, పాదాలు కూడా ఉబ్బిపోతాయన్నారు. అటువంటి సందర్భాలలో ఇంట్రవెన్షనల్‌ రేడియోలజీ ఎంతో ప్రయోజనకరమైనదని అన్నారు. కాళ్ళకి ఉండే సిరలు మూసుకుపోయి కాళ్ళ వాపులు, పాదాల వాపులు వచ్చినప్పుడు ఒక కాలు కావచ్చు, రెండు కాళ్ళు కావచ్చు తిమ్మిరిగా, బరువుగా అనిపించడం, సూదులు గుచ్చినట్లు నొప్పి, దురద, పుళ్ళు వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు. వీటికి మూలాన్ని కనుగొనడానికి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తోడ్పడుతుందన్నారు. సిరలలో రక్తపు గడ్డలతో అడ్డంకులు ఏర్పడినప్పుడు కలిగే వాపులకు ఇంట్రవెన్షనల్‌ రేడియోలజీ ఒక్కటే సరైన పరిష్కారమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మారు పాల్గొన్నారు.