ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత్ - జపాన్‌ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా జపాన్ - ఇండియా మారిటైమ్ ఎక్సర్‌సైజ్ (జెఐఎంఇఎక్స్-23)ను తలపెట్టామని ఇండియన్ నేవీ రియర్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్ తెలిపారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జెఐఎంఇఎక్స్-23 ఏడో ఎడిషన్ విన్యాసాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గురుచరణ్ సింగ్, జపాన్ నేవీ అడ్మిరల్ నిశియమ టకహిరో ఐఎన్‌ఎస్ కమోర్టా నౌకలో సంయుక్తంగా గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత గురుచరణ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నెల ఏడు వరకూ భూ ఉపరితలం, సముద్రం, ఆకాశంలో ఈ విన్యాసాలు కొనసాగుతాయన్నారు. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ ఢిల్లీ, ఐఎన్‌ఎస్ కమోర్టా, దేశీయంగా తయారైన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కార్వెట్, ఫ్లీట్ ట్యాంకర్, ఐఎన్‌ఎస్ శక్తి, సముద్ర గస్తీ విమానం పి-81 డోర్నియర్, పలు యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయని వివరించారు. నిశియమ టకహిరో మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి, సముద్ర భద్రతను పటిష్టం చేసుకోవడానికి ఈ విన్యాసాలు తోడ్పడతాయన్నారు. స్నేహబంధం మరింత బలపడుతుందని తెలిపారు.










