'కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలన' అని ఊదరగొట్టిన ప్రధాని మోడీ ఇప్పుడు 78 మందితో జంబో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంతో కమలనాథుల ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలేనని మరోసారి స్పష్టమైంది. అయితే, బిజెపి హయాంలో దేశంలో విద్వేష విధానాలు, ధ్వంస రచనే తప్ప ప్రజలకు గరిష్ట పాలన అందలేదన్నది పచ్చి నిజం. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉపాధి, నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికీ 15 లక్షల రూపాయలు జమ చేస్తాం వగైరా హామీల్లానే ఇది కూడా... కోవిడ్ కట్టడిలో తీవ్ర వైఫల్యం, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయాల నేపథ్యంలో మరో ఏడాదిలో రానున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ మున్నగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ విస్తరణ జరిగిందన్నది జన వాక్యం. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తగా 36 మందిని మంత్రిమండలి లోకి తీసుకున్నారు. ఏడుగురు సహాయ మంత్రులకు పదోన్నతి కల్పించడంతో ప్రధానితో సహా కేంద్ర కేబినెట్ 78కి చేరింది. కేంద్ర మంత్రివర్గం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదన్నది నిబంధన. ఆ ప్రకారం 81 మందికే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ఆ సీలింగ్‌కు చేరువలో ఉన్నారన్నమాట.
కోవిడ్ కట్టడిలో విఫలమైనందునే ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను తొలగించారని ప్రచారం సాగుతోంది. కరోనాను అదుపు చేయడానికి అవసరమైన ప్రజారోగ్య వ్యవస్థల పటిష్టీకరణ, మందులు, ఇతర వైద్య సేవలందించేందుకు తగు చర్యలు తీసుకోవలసిందిపోయి 'చప్పట్లు కొట్టండి.. పళ్లాలు మోగించండి.. దీపాలు వెలిగించండి' వంటి నినాదాలతో పొద్దు పుచ్చిన ప్రధాని అలాగే కొనసాగుతూ వైఫల్యాలకు మంత్రిని బాధ్యుడ్ని చేస్తే ఎలా? 'నమస్తే ట్రంప్' పేరిట కరోనా కట్టడి చర్యలను నిర్లక్ష్యం చేయడం మొదలు దేశీయ అవసరాలు పట్టించుకోకుండా వ్యాక్సిన్లను ఎగుమతి చేయడం వరకూ నిర్ణయాలకు ప్రధానిదే కదా బాధ్యత! అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఇటు పార్టీ పరంగానూ అన్నీ తామై నడుపుతున్న మోడీ-షా ద్వయం మంచి జరిగితే తమ ఖాతాలో వేసుకొని, వైఫల్యాలకు ఇతరులను బలిపశువులను చేయడం అత్యంత మోసపూరితం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బిజెపి లోకి ఫిరాయించిన జ్యోతిరాదిత్య సింథియాకు కేబినెట్ హోదా కట్టబెట్టారు. కుట్ర చేసి చిరాగ్ పాశ్వాన్‌ను పక్కకు నెట్టి ఎల్‌జెపి ని చేజిక్కించుకున్న హాజీపూర్ ఎం.పి పశుపతి కుమార్ పరాశ్‌ను మంత్రివర్గం లోకి తీసుకున్నారు. ఎన్‌డిఎ లో చిరకాలం కొనసాగిన శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటి మిత్రులు బిజెపి పోకడలవల్ల దూరమయ్యాక రిపబ్లికన్ పార్టీకి చెందిన రామదాస్ అథవాలే ఒక్కరే కేబినెట్‌లో ఉన్నారు. ఆ లోటును భర్తీ చేసేందుకా అన్నట్టు ఇప్పుడు జెడియు, ఎల్‌జెపి లకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల నుండి తీసుకున్న మంత్రుల సంఖ్య, వ్యక్తులనుబట్టే బిజెపి ప్రాధాన్యతలు బోధపడతాయి. ఎన్నికల దృష్టితో విస్తరణ చేపట్టారు కనుక సోషల్ ఇంజనీరింగ్‌పై కేంద్రీకరించారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి మంత్రుల దామాషా పెరిగింది. మంత్రివర్గంలో మైనారిటీల సంఖ్య పెరిగింది. మైనార్టీలను మంచి చేసుకునేందుకు ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం మాట్లాడడం గమనార్హం. మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరడం మంచిదే. అయితే, 'నస్త్రీ స్వాతంత్య్రమర్హతి' అన్న మనువాద సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న పరివార్ శక్తుల నిజ స్వరూపాన్ని ఎవరూ విస్మరించరాదు. మహిళా బిల్లును పక్కనబెట్టి కొందరు మహిళల్ని మంత్రులను చేసినంత మాత్రాన స్త్రీలకు న్యాయం జరుగుతుందా? నలుగురు సీనియర్లను తొలగించడం, 50 ఏళ్లలోపువారు 14 మందిని కొత్తగా తీసుకోవడంతో మంత్రిమండలిలోని సభ్యుల సగటు వయసు 61 నుంచి 58కి తగ్గింది. అయితే యువతకు ఉపాధి అవకాశాలు పెంచకుండా మంత్రివర్గ సగటు వయసు ఎంతవున్నా ఒరిగేదేమిటి? ప్రభుత్వ విధానాలు మారకుండా కొందర్ని తొలగించి, ఇంకొన్ని కొత్త ముఖాల్ని ముందుంచినంత మాత్రాన ప్రజలకు ఏ ప్రయోజనమూ ఒనగూరదు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు కోవిడ్ విపత్తుతో అల్లాడుతున్న సమయంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా తగు చర్యలు తీసుకోవాలి. అలా చేయకపోతే ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని జనం భావిస్తారు.










