పరీవాహక ప్రాంతాన్ని అనుసరించి కేటాయింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే గతంలో ట్రిబ్యునల్స్ చేసిన కేటాయింపులు, విభజన చట్టం, అంతర్జాతీయ ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా పంపకాలైనా జరుగుతుంటాయన్న విషయాన్ని విస్మరించరాదు. ఏకపక్షంగా 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనన్న వైఖరి తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాబోదు.
జల వివాదాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఉభయ పాలకులు ఉద్వేగాలను, విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మాటలు హద్దు మీరుతున్నాయి. పరుష పదజాలం వాడుతున్నారు. శత్రుదేశాలతో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించినట్టుగా సాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు వైపులా పోలీసు బలగాలు మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు. కృష్ణానదీ జల వివాదాలు ఆసరా చేసుకొని తమ రాజకీయ, స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఇరు రాష్ట్రాల పాలకులు చేస్తున్నారు. పరిష్కారం చూపాల్సిన కేంద్ర సర్కార్ రొచ్చుగుంటలో చేపలు పట్టే పనిలో ఉంది. ఇరు రాష్ట్రాల్లోని బిజెపి నేతలు తలో వైఖరి తీసుకుని విద్వేష ప్రవచనాలతో రెచ్చగొడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో ఆంధ్రా జల దోపిడీ చేస్తోందని తెలంగాణలో బండి సంజరు చెబుతుంటే, కృష్ణా జలాలను తెలంగాణ దొంగిలించుకుపోకుండా ఎ.పి సి.ఎం అడ్డుకోవాలని కర్నూలులో నిర్వహించిన సభలో బిజెపి నేతలు చెప్పారు. ఒకే పార్టీ వారు అక్కడో మాట...ఇక్కడ మరో మాట చెబుతున్నారు. ఇళ్లు తగలబడుతుంటే బొగ్గులేరుతున్న చందంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల జగడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక కారణమైతే, రెండవది రిజర్వాయర్లలో తగు నీటిమట్టం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరుశాతం విద్యుత్ ఉత్పాదన చేపట్టడం. ఇది మొదట లేఖల యుద్ధంతో ప్రారంభమై మాటల యుద్ధానికి దారి తీసింది. రెండు రాష్ట్రాలు కయ్యం పెట్టుకుంటుంటే కేంద్రం చోద్యం చూస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎపెక్స్ కమిటీ, కృష్ణా నది పరీవాహక మేనేజ్‌మెంట్ బోర్డు.. ఇన్ని వుండి కూడా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎప్పటికప్పుడు అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి అవకాశం ఉంటే వారు జలాలను తమ ఇష్టమొచ్చినట్లు వాడుకుపోవటానికి ఆస్కారం కలుగుతుంది. ఎవరి జల అవసరాలు వారికుంటాయి. అలాగని ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి, హద్దు మీరి జలాలను అదనంగా వాడుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ కృష్ణాజలాల వివాదం కొనసాగటం గమనార్హం.
కృష్ణానది పుట్టిన మహారాష్ట్ర, ఆ తర్వాత పరీవాహక ప్రాంతమైన కర్నాటక, చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మధ్య 1960వ దశకంలో జలవివాదాలు రగులుకున్నాయి. దాన్ని పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్ బచావత్ ట్రిబ్యునల్‌ను నియమించింది. ట్రిబ్యునల్ అంతకుముందు కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని, నదిలో వంద సంవత్సరాల జల ప్రవాహం, పరిమాణాన్ని పరిగణలోకి తీసుకొని, వివిధ దేశాలలో నీటి పంపకాల విషయంలో అనుసరించే ప్రాతిపదికలను పరిశీలించి చివరకు మూడు రాష్ట్రాల వాటాలను తేల్చింది. ఆర్.ఎస్ బచావత్ ప్రముఖ ఇంజనీర్ కావడంతో ఆయన అనేక అంశాలను దూరదృష్టితో పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా నికర జలాలను తేల్చారు. ఇందులో మిగులు జలాలు కూడా ఎవరు ఎలా వాడుకోవాలి అన్నదానిపై కూడా పరిష్కారం చూపారు. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 2060 టిఎంసీలు నికరజలాలుగా నిర్ణయించింది. మహారాష్ట్ర కు 560 టిఎంసిలు, కర్నాటక కు700 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్ కు 811 టిఎంసిలు కేటాయిస్తూ 1973 సంవత్సరంలో తీర్పునిచ్చింది. ఆ తీర్పు గడువు 2000 జూన్ 30తో ముగిసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసింది. కృష్ణానదీ జలాలను 65 శాతం డిపెండబులిటీపై 2060 టిఎంసి గా ఉన్న నికర జలాలను బ్రిజేష్ కమిటీ 2578 టిఎంసి లుగా గుర్తించింది. కర్ణాటకకు 700+211=911 టిఎంసిలు, మహారాష్ట్రకు 560+106=666 టిఎంసిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811+190=1001 టిఎంసిలు కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలు 811 టిఎంసిలలో విభజనానంతరం 512 ఆంధ్రప్రదేశ్‌కు, 299 టిఎంసిలు తెలంగాణకు కేటాయించబడినాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ అదనంగా కేటాయించిన 190 టిఎంసిలతో సహా ఉభయ రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం కృష్ణా జలాల్లో చెరి సగం పంచుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్‌కు తన వాదనలను వినిపిస్తున్నది.
గత సంవత్సరం పోతిరెడ్డిపాడు ఎగువన సిద్ధేశ్వరం వద్ద కేంద్రం నుండి అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించి, పథకాన్ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మరో నాలుగు టిఎంసిల నీటిని తెలుగుగంగ కాల్వకు లింక్ చేయడం ద్వారా రోజుకు ఎనిమిది టిఎంసిల నీటిని అంటే 80 వేల క్యూసెక్కులు నీటిని తోడుకుపోవచ్చు. ఎటువంటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వ జలసంఘం దృష్టికి తీసుకుపోకుండా, నీటి కేటాయింపులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాయలసీమ పథకాల ద్వారా వరద సమయంలో రోజుకు 80 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలిస్తే నాగార్జునసాగర్‌కు, కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి మొదలగు పథకాలకు నీళ్లు మిగలవని తెలంగాణ ప్రభుత్వం వాదన. అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులను నిలపాలని కేంద్రం వద్ద వాదిస్తున్నది. రాయలసీమ పథకంపై పర్యావరణ అనుమతులు లేవని, ఎన్‌జిటి ఇచ్చిన స్టే ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తూ ఉండటాన్ని గుర్తుచేసింది. కృష్ణా రివర్ బోర్డు కూడా రాయలసీమ పథకాన్ని పరిశీలించిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని వివరిస్తామని అంటున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా జూరాల ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నది. అనుమతి లేని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపకపోతే తాము కూడా తమ ప్రాంతంలో కృష్ణానదిపై ప్రాజెక్ట్‌లు కట్టుకొని నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ సర్కారు అంటున్నది.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో 68 శాతంకు పైగా తెలంగాణలో, 32 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందున 548 టిఎంసిలు తమకు దక్కాలని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. అందుకు బదులుగా కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించబడినాయని, 32 శాతం మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్ 512 టిఎంసిలు ఎలా పొందుతున్నదని ప్రశ్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పరీవాహక ప్రాంతాన్ని అనుసరించి కేటాయింపులు జరపాలని వాదిస్తోంది. అయితే గతంలో ట్రిబ్యునల్స్ చేసిన కేటాయింపులు, విభజన చట్టం, అంతర్జాతీయ ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా పంపకాలైనా జరుగుతుంటాయన్న విషయాన్ని విస్మరించరాదు. ఏకపక్షంగా 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనన్న వైఖరి తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాబోదు.
కాగా ప్రాజెక్టులు నిండక ముందే, శ్రీశైలంలో జలాలు కనీసం 834 అడుగులకు చేరక ముందే తెలంగాణ విద్యుత్తును ఉత్పత్తి చేసి రోజుకు 30 వేల క్యూసెక్కుల వాడుకుంటోందని, ఇది అక్రమమని ఆంధ్రప్రదేశ్ వాదన. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలోనూ తెలంగాణ సర్కారు జలవిద్యుదుత్పత్తి చేసి దిగువకు నీరు వదుల్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయడం వల్ల రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా నీళ్లు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో వృధాగా పోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించుకుంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర అనుమతులు లేకుండా అనేక ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని ఎ.పి ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోంది. తమకు కేటాయించిన జలాల నుండే తమ అవసరాలకనుగుణంగా వాడుకుంటున్నామని కేసీఆర్ అంటున్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి వాడకం విషయంలో వివాదాలు ముదురుతున్నాయి. ఈ అంశాలపై చర్చించి, నిర్ణయాలు చేయడానికి జులై 9న జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశాన్ని జులై 20 తరువాత జరపాలని తెలంగాణ సర్కారు కోరగా ముందుగా అనుకున్న రోజునే జరపాలని ఎ.పి ప్రభుత్వం కోరింది. అయితే, కేంద్ర జలశక్తి శాఖ సమావేశాన్ని తిరిగి ఏ తేదీన జరుపుతామన్నదీ చెప్పకుండానే వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు లేని జలాలను రాయలసీమకు తరలించుకుపోతున్నదనీ, దాదాపు 450 టిఎంసీలు నిల్వ చేసుకునే 32 రిజర్వాయర్లను తెలుగుగంగ పథకం కింద ఏర్పాటు చేసుకున్నదనీ, దాదాపు 150 టిఎంసీలకు పైగా అక్రమంగా నీటిని వాడుకుంటున్నదనేది తెలంగాణ విమర్శ. కాని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. 2005లో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం పథకం పది కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. తెలంగాణ వచ్చి ఏడేళ్లు అయినా ఈనాటికీ పూర్తి చేయలేదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉల్పర, ఉదయ సముద్రం లాంటి లక్షల ఎకరాలకు గ్రావిటీ, ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించే అనేక పథకాలు నేటికీ పెండింగ్‌లో పడిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం ప్రారంభమైన హంద్రీ నీవా, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలుగొండ తదితర ప్రాజెక్టుల నిర్మాణమూ నత్తనడకనే సాగుతున్నాయి. ఇప్పటికైనా ఉభయ రాష్ట్రాలలో దీర్ఘ కాలంగా కరువు బారిన పడుతున్న ప్రాంతాల్లోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఆ దిశగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్యాచరణకు పూనుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను జరిపి, శాస్త్రీయమైన నిర్వహణా విధానాల్ని నిర్ణయించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ జల వివాదం మరింత జటిలం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని పరిష్కరించాలి. అందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సహకరించాలి. ఉభయ రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థల సహకారం తీసుకొని, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. ఇందులో ఎవరు నెగ్గారు! ఎవరు తగ్గారు! అన్నది ముఖ్యం కాదు. తెలుగు ప్రజల శ్రేయస్సు, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడమే సరైన మార్గం.
/వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు,
సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
జూలకంటి రంగారెడ్డి











