ప్రజాశక్తి-నెల్లూరు : నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపడమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని, కార్యక్రమంపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ సచివాలయ హెల్త్ కార్యదర్శులకు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా స్థానిక దొర తోపు సెంటర్, సి.ఆర్.పి డొంక ప్రాంతాల్లో గహాలకు వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను కమిషనర్ బుధవారం పరిశీలించారు. అనారోగ్యానికి గురైన వారికి వివిధ రకాల పరీక్షలను నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలును అధికారులంతా పటిష్టంగా సమీక్షించనున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం అమలులో భాగంగా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపడం, ఆలాగే ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొనేలా ఆరోగ్య శ్రీ పధకంపై అవగాహన కల్పించాలని హెల్త్ సెక్రెటరీలను కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించేందుకు ఈ నెల 15 నుండి వాలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారము, 16 నుండి ఏ.ఎన్.ఎం./సి.హెచ్.ఓ.ల ఇంటింటి సర్వే నిర్వహించి సాదారణ వ్యాధులతో పాటు దీరకాలిక వ్యాధులు, గర్బిణీలు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, నాన్ కమ్యూనబుల్ వ్యాధులతో బాధపడేవారి వివరాలను జగనన్న ఆరోగ్య సురక్ష యాప్ లో పొందపరుస్తున్నారని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే వైద్య శిభిరాల్లో సాధారణ వైద్యులతో పాటు ఆర్థో, గైనకాలజీ, పీడియాట్రిక్స్ తదితర విబాగాల వైద్య నిపుణులు పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని కమిషనర్ తెలిపారు. ఈ శిబిరాలకు వచ్చే రోగులకు అవసరమైన ఔషధాలను వెంటనే అందజేసేలా, అందుకు అవసరమైన ఔషదాలు అన్నింటినీ ముందుగానే నిల్వ ఉంచుకునేలా తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శర్మద, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.










