Sep 28,2023 08:48
  • జ్వరం వల్ల మండలికి ఆరోగ్యశాఖ మంత్రి గైర్హాజరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనమండలిలో విద్య, వైద్యరంగాలపై బుధవారం జరగాల్సిన లఘు చర్చకు మంత్రులు విముఖత తెలపడంతో ఈ అంశాలపై చర్చలు లేకుండా సభ నిరవధికంగా వాయిదా పడింది. విద్యా రంగంలో మార్పులు, సంస్కరణలు, వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులపై లఘు చర్చ జరుగుతుందని అజెండాలో పేర్కొన్నా.. సాయంత్రం వరకు చర్చ జరగలేదు. చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్‌ జంగా కృష్ణమూర్తి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆసక్తి చూపలేదు. తాను మంగళవారం మండలిలో విద్యాశాఖపై ఐదు ప్రశ్నలకు చర్చలో అన్ని అంశాలూ చెప్పానని ఇంకా చెబుతామని నిరాసక్తత వ్యక్తం చేశారు. అలాగే మంత్రి రజిని తనకు జ్వరంగా ఉండటం వల్ల చర్చలో పాల్గొనలేనని విముఖత తెలిపారు. దీంతో ఈ రెండు అంశాలపై చర్చ జరగలేదు. కేవలం స్కిల్‌ డెవలప్‌మెంట్‌పైనే చర్చ జరిగింది. ఐదు రోజుల్లో మండలిలో 18 బిల్లులకు ఆమోదం తెలపగా, వ్యవసాయం, సిల్క్‌ డెవలప్‌మెంట్‌ రంగాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. మొత్తం ప్రత్యేక ప్రస్తావన ద్వారా 36 అంశాలను సభ్యులు ప్రస్తావించారు. వీరికి జవాబులు సంబంధిత శాఖ అధికారులు తరువాత పంపిస్తారని ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు తెలిపారు. మొత్తం ఐదు రోజుల్లో 17 గంటల 12 నిమిషాలపాటు సభ జరిగిందని 18 బిల్లులు ఆమోదం పొందాయని పేర్కొన్నారు.