Sep 26,2023 08:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులను ప్రపంచంలో అత్యున్నత 100 విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ఉమ్మడి సర్టిఫికెట్‌ను విద్యార్థులు పొందేలా చట్టసవరణ చేశారు. రాష్ట్రంలోని దేవాదాయశాఖకు చెందిన భూములు వార్షిక కౌలు చెల్లించకుండా సాగులో వున్నా, దేవాలయాల వద్ద ఉండే దుకాణాలకు సంబంధించి లైసెన్స్‌ కాలపరిమితి ముగిసినా, అలాగే వుంటే అలాంటి కేసులను ఆక్రమణదారులుగా గుర్తించి నాన్‌బెయిలబుల్‌ కేసులను పెట్టేలా చట్టసవరణ చేశారు. సోమవారం శాసనసభలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ సవరణ బిలును ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది. రవాణాశాఖకు సంబంధించి మూడు టన్నుల బరువును తీసుకెళ్లే ఆటో, నాలుగు చక్రాల వాహనాలకు ఇప్పటిదాకా అమలులో వున్న జీవితకాలపు పన్ను విధానాన్ని రద్దు చేసి త్రైమాసిక పద్ధతిలోగాని, ఆరునెలలకోసారిగాని పన్నులను చెల్లించేలా చట్టసవరణను రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది.
            ఆర్‌టిసి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినందున వారు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం క్రమశిక్షణా చర్యలు వుండేలా చట్టసవరణ ప్రతిపాదనను మంత్రి పినిపె విశ్వరూప్‌ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును సభ ఆమోదించింది. వస్తుసేవల పన్ను చట్టసవరణను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.