ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐదు రోజులపాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు రాష్ట్ర మంత్రులు సమాధానాలు తెలిపారన్నారు. బిసి సంఘాలు, నాయకులు కోరుతున్న విధంగానే రాష్ట్రంలో కులగణన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశాల్లో సాహసోపేత నిర్ణయం ప్రకటించారని తెలిపారు.
- చంద్రబాబు ఆస్తి రూ.2 లక్షల కోట్లు : రోజా
టిడిపి అధినేత చంద్రబాబు ఆస్తి రూ.2 లక్షలు అని పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. హెరిటేజ్ కంపెనీలో 2 శాతం షేర్లు అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని, మొత్తం అమ్మితే రూ.20 కోట్లు వస్తాయని ఇటీవల చంద్రబాబు భార్య భువనేశ్వరి చెప్పారని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.20 వేల కోట్లను చూపారా లేదా అన్నది అధికారులు తేల్చాలన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ప్యాలెస్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని, ఆయన అన్ని ఆస్తులు కలిపితే రూ.2 లక్షల కోట్లు ఉంటాయన్నారు. ఇదంతా ప్రజల్ని దోచుకున్న సొమ్మేనని ఆరోపించారు.
శ్రీక్రమబద్ధీకరణ బిల్లును ఆమోదించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్టు ఎంప్లాయీస్ జీవితాల్లో వెలుగులు నింపారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, కల్పలతరెడ్డి అన్నారు. వైసిపి ప్రభుత్వం క్రిటికల్ కేర్ వైద్యాన్ని మండల స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చిందని మరో ఎమ్మెల్సీ సుబ్రమణ్యం కొనియాడారు.
శ్రీఅసెంబ్లీ సమావేశాల్లో టిడిపి హాయంలో జరిగిన స్కామ్‌లపై అర్థవంతమైన చర్చ జరిగిందని ప్రభుత్వ విప్ ఉదయభాను అన్నారు. స్కామ్‌లకు సమాధానం చెప్పలేక టిడిపి సభ్యులు సభను బహిష్కరించి వెళ్లిపోయారన్నారు.










