Sep 28,2023 08:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఐదురోజుల పాటు జరిగిన ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభలో ఈసారి సిఎం జగన్‌ ఒక్కసారి కూడా ప్రసంగించకుండానే సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్ష టిడిపి సభ్యులు మొదటి రెండు రోజులు చంద్రబాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టి ససెన్షన్‌కు గురయ్యారు. తరువాత మూడు రోజులు వారు సభను బహిష్కరించి మాక్‌ అసెంబ్లీ ద్వారా టిడిపి కార్యాలయంలోనే తమ వాదన వినిపించుకున్నారు. ఉభయ సభల్లో అధికార పార్టీ సభ్యులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భక్తిని చాటుకున్నారు. సిఎం జగన్‌ ఈ అంశంపైనా చర్చలో పాల్గొనలేదు. స్వల్పకాలిక చర్చల్లో కూడా మాట్లాడకుండా మంత్రులతోనే మాట్లాడిం చారు. ఉభయ సభలో మొత్తం 18 బిల్లులు ఆమోదించారు. ఈసారి ఎటువంటి నివేదికలు సమర్పించలేదు. సభ జరిగినన్ని రోజులు ప్రశ్నోత్తరాలు దాదాపుగా పూర్తిస్థాయిలో జరిగాయి. మండలిలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పలు ప్రజా సమస్యలపై తమ వాదన బలంగా వినిపించారు. బుధవారం సాయంత్రం మండలిలో ప్రవేశపెట్టిన జిపిఎస్‌ బిల్లుపై పిడిఎఫ్‌ సభ్యులు తమ నిరసన, వ్యతిరేకత తెలియజేస్తూ సిపిఎస్‌ రద్దు విషయంలో సిఎం జగన్‌ మాట తప్పారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికలకు మరికొద్దినెలల సమయం ఉండటంతో ఈ టర్మ్‌కు ఇదే దాదాపుగా చివరి సమావేశాలుగా భావించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల నుంచి తమ అనుచరులతో సహా తరలివచ్చారు. మళ్లీ డిసెంబరులో శీతాకాల సమావేశాలు జరగవచ్చునని లేదా ఫిబ్రవరిలో కొద్ది రోజులు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగవచ్చునని సమాచారం.