Mar 14,2022 06:57

కలవరపడుతూ
కటిక చీకటిని మోస్తున్న
ఈ రాత్రిని ఒక్క మాటతోనైనా
నేనిప్పుడు ఓదార్చాలి
నాలుగే నాలుగు మాటల్ని
మంత్రించి మరణ రహస్యాన్ని దాచి పెట్టాలి

నిద్రకు ఉపక్రమించి
నిశ్శబ్దాన్ని నీడలాగ నిలబెట్టాలి
ఏడుస్తూ ఆకాశం రాల్చే
కొన్ని కన్నీటి బిందువులు
హృదయానికి ఓదార్పులా నిలవాలి

రెక్కలు తెగి నేల రాలుతున్న
జ్ఞాపకాల ఉల్కలను
ఊరడిస్తూ మేల్కొలపాలి
కసిరికొట్టి, పారిపోతున్న కరిమబ్బును
కాసేపైనా నిలబడి
కన్నీటి పాటను పాడమని ప్రాధేయపడాలి

రాత్రంటే చీకటి కాదని
చీకటి అంటే చీత్కారం కాదని
చీకటికి వెలుగుకి యుద్ధం అని
వెలుగెత్తి అరవాలి

రెప్ప పాటు క్షణాల్ని
నిశిరాత్రి కాటేయక మునుపే
రెండు కళ్ళను కాలానికి అప్పగించాక
జీవనరాగాన్ని ఆవిష్కరించాలి!

- మహబూబ్‌ బాషా చిల్లెం
95020 00415