ఒట్టావా : అమెరికాకు చెందిన హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. అమెరికాకు చెందిన 10,000 మంది హెచ్-1బి వీసాదారులు తమ దేశంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ వర్క్-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కెనడా వసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ ప్రొగ్రామ్ కింద హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకునేందుకు, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ వెల్లడించారు.
హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. అమెరికాలో పనిచేసేవారు హెచ్-1బీ స్పెషల్ ఆక్యుపేషన్ వీసాను కలిగి ఉంటారు. జులై 16, 2023 నాటికి హెచ్-1బీ స్పెషల్ ఆక్యుపేషన్ వీసాలతో అమెరికాలో పనిచేస్తున్నవారు, వారి కుటుంబసభ్యులతో కలిసి కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద.. ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాదారులకు మూడేళ్ల కాల వ్యవధితో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం లేదా చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇమ్మిగ్రేషన్ స్ట్రీమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఫ్రేజర్ వెల్లడించారు. అయితే, ఈ స్ట్రీమ్ కింద దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులు అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.










