Mar 07,2022 06:59

ఆంధ్ర చిత్రకళకు ప్రత్యేకమైన శోభను చేకూర్చిన వారు దామెర్ల రామారావు. 1897 మార్చి 8వ తేదీన జన్మించిన ఆయనకు ఇది 125వ జయంతి సంవత్సరం. రామారావు గారికి చిత్రకళా ప్రతిభ వారసత్వంగా రాలేదు. ప్రయత్నపూర్వకంగా వచ్చింది. పదేళ్ల లోపు వయసులో బొగ్గుముక్కలతో గోడల మీద, పెన్సిల్‌తో పేపర్‌ పై చిత్రించి చిత్రకళాసాధన చేశాడాయన. ఆయనలో చిత్రకళని గుర్తించి ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి డ్రాయింగ్‌ టీచరుగా పనిచేసే తన మేనమామ గాడిచర్ల రామ్మూర్తి.
      ఆ రోజుల్లో ముఖ్యంగా రాజమండ్రిలో నాటకాల ప్రదర్శనలు ఎక్కువగా జరిగేవి. అప్పట్లో నాటకాన్ని కొత్త తరహాలో ప్రదర్శిస్తున్న వారిలో ముఖ్యులు హిందూ డ్రమెట్రికల్‌ కంపెనీ వారు. ప్రతి ఒక్క నాటకాన్ని కొత్త బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్తగా తయారుచేసి ప్రదర్శించేవారు. వి.ఎస్‌.రామ్‌ అనే చిత్రకారుడు బ్యాక్‌డ్రాప్స్‌ని కొత్తగా చిత్రించేవారు. ఆయన గీసే ప్రతి చిత్రాన్ని తదేకంగా గమనించేవారు దామెర్ల. ఏ రంగు ఎందుకు కలుపుతారో, ఏ గీత ఎంతమేరకు గీయాలో సూక్ష్మంగా గమనించేవారు. తరువాత తానూ సాధన చేసేవాడు.
      1909లో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీకి ఆస్వాల్డ్‌ జెన్నింగ్స్‌ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్ప కవీ, రచయిత, స్పోర్ట్స్‌ మ్యాన్‌, చిత్రకారుడు కూడా. ఇక్కడికి వచ్చిన కొద్ది సంవత్సరాలకే తెలుగుభాషపై పట్టు సాధించాడాయన. ఓసారి నాటకాన్ని చూడడానికి వెళ్ళిన కూల్డ్రే .. పెయింటింగ్స్‌ని శ్రద్ధగా గమనిస్తున్న రామారావుని చూసి, అతడి చిత్రకళాసక్తిని, సృజననీ చూశాడు. తరువాత చిత్రకళలో మెళుకువలు ఎన్నో నేర్పి ప్రోత్సహించాడు. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడుతున్న రామారావు గారి తండ్రికి అలాంటి దిగులు అవసరమే లేదని భరోసా ఇచ్చాడు. ఇతను భవిష్యత్తులో గొప్ప చిత్రకారుడు అవుతాడని చెప్పాడు. తరువాత తన ఖర్చులతో రామారావు గారిని బొంబాయిలోని జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌కి శిక్షణ నిమిత్తం పంపించారు.
       1916లో రాజమండ్రి నుంచి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె.స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ సిసిల్‌ ఎన్‌ బర్న్స్‌... రామారావు ఏ గురు శిక్షణ లేకుండా వేసిన రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి, ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరం కోర్సులో అవకాశం ఇచ్చాడు. కాలేజీలో కొందరు తొలుత రామారావుని చిన్న చూపు చూసినా, తరువాతి కాలంలో అతడి బొమ్మలను చూసి, ముక్కున వేలేసుకున్నారు. నలుగురిలో కలవక అమాయకంగా ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సజనాత్మకత ఉందా? అని వారు ఆశ్వర్యపోయారు.
         కళాశాల విద్య తరువాత దామెర్ల మూడేళ్ల పాటు ఉత్తర భారత పర్యటన చేసి, ఎంతో మంది చిత్రకారుల్ని కలుసుకున్నాడు. ఆ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాలను చిత్రించారు. సౌరాష్ట్ర భావనగర్‌లోని మహారాజు కృష్ణకుమార్‌ సింగ్‌ ... దామెర్ల ప్రతిభ గురించి విని, ఆయన్ని తన రాజమహల్‌కి పిలిపించుకొని కుటుంబీకుల చిత్రాలను ప్రత్యేకంగా చిత్రించుకున్నారు. అక్కడే ఏదో పని మీద వచ్చిన రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ని కలిసి, ముచ్చటించారు. ఆయన ప్రశంసలను పొందారు.
         చిత్రకళా విద్యలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై 'బంగారు పతకం' అందుకుని, గొప్ప చిత్రకారుడిగా ఖ్యాతి గడించిన రామారావు గారికి లక్నో స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాలుగా ఉద్యోగాహ్వానం వచ్చింది. దానిని ఆయన స్వీకరించలేదు. సొంత నేలమీదనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో 23 ఏళ్లకు చిత్రకళా శిక్షణ ముగించుకొని రాజమండ్రి తిరిగివచ్చారు. 1919లో సత్యవాణితో వివాహం జరిగింది. సత్యవాణికి కూడా చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం అంటే ఎంతో ఆసక్తి.
           ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆస్వాల్డ్‌ జెన్నింగ్స్‌ కూల్డ్రే ... రామారావును అజంతా, ఎల్లోరాలను సందర్శించి, అక్కడి గచ్చుపై చిత్రాలు, శిల్పకళ మీద స్కెచ్‌ వేయమని ప్రోత్సహించారు. చిత్రకారులకు మోడల్‌ లభించడం ఎంతో కష్టమైన ఆరోజుల్లో తన భార్యనే మోడలుగా ఉంచి ఎన్నో కళాఖండాల వంటి చిత్రాలు గీశారు దామెర్ల. ఆయన పారిస్‌ కళాకారుడు ూబఙర సవ జష్ట్రaఙవఅఅవరతో పోల్చేవారు. 1922లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన 'ఋష్యశృంగ బంధనం' చిత్రానికి ప్రథమ బహుమతిగా 'వైస్రాయి ఆఫ్‌ ఇండియా' పతకం లభించింది.
         'ఆంధ్ర సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్స్‌' పేరున 1922లోనే ఆయన రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాల స్థాపించి ఎంతోమందికి చిత్రకళ నేర్పారు. వీరిచిత్రాల్లో ప్రముఖమైన 'సిద్ధార్థ రాగోదయం', 'పుష్పాలంకరణ', 'కార్తీక పౌర్ణమి' మొదలైనవి ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, లండన్‌, టొరాంటోలలో ప్రదర్శనలో చోటుచేసుకుని, బహుమతులు పొందాయి.
        ఆంధ్రా సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌ పేరిట ఒక సంస్థను రాజమండ్రిలో ఏర్పాటు చేసి యువ కళాకారులకు శిక్షణ ఇచ్చేవారు దామెర్ల. 1923లో రాజమండ్రిలో మొట్టమొదటిగా అఖిల భారత చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో రామారావు వేసిన కృష్ణ లీలలు చిత్రాన్ని ఇంపీరియల్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్స్‌ లండన్‌కు, కొన్ని చిత్రాలను కెనడాకు పంపించారు. ద్రోణాచార్య, ఊర్వశి, అర్జున, అభిమన్యుని పతనం వంటి బొమ్మలను బొంబాయి, నాగపూర్‌లలో జరిగే ప్రదర్శన్లకు పంపించేవారు. 1923లో రామారావు గారికి ఒక్క మగబిడ్డ పుట్టి, ఆరునెలలకే చనిపోవడం వారి జీవతంలో పెద్ద విషాదం. ఇప్పుడు దామెర్ల ఆర్ట్స్‌ గాలరీ రాజమండ్రి రైల్వేస్టేషనుకు సమీపంలో ఉంది.
           దామెర్ల గురువు కూల్డ్రే గతంలో ఎన్నో దేవాలయాలను సందర్శించి, అక్కడే చిత్రాలను రికార్డు చేసే ప్రయత్నం చేశారు. దేవాలయాలపై ఉన్న అద్భుతమైన శిల్పకళను వీలున్నప్పుడు చిత్రిస్తే బావుంటుందని ఆయన చాలాసార్లు దామెర్లకు సూచించారు. బిడ్డ మరణం తరువాత భార్య సత్యవాణితో కలిసి కొన్ని దేవాలయాలను సందర్శించారు. తిరుమల పరిసర దేవాలయాలపై ఉన్న శిల్పాలను, నల్లమల కొండలు, పుష్కరిణి ... ఇలా ఎన్నో చిత్రాల్ని తన కెమెరాలో బంధించారు. తిరుమల నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో రైలులోనే ఒక చిత్రాన్ని మొదలుపెట్టారు. దానికి మృత్యువు అనే శీర్షిక పెట్టారు. విజయవాడకు చేరుకునే లోపే ఆయనకు జ్వరం వచ్చింది. సాధారణ జ్వరమే, తగ్గిపోతుంది అనే భావనతో ఉన్నారు రామారావు. కొనసాగింపుగా మశూచి సోకి, నయం కాక 1925 ఫిబ్రవరి 6వ తేదీన 28 ఏళ్లకే అకాల మరణం చెందారు. రామారావు గారి మరణవార్త విని, సరోజినీ నాయుడు గారి తమ్ముడు వీరేంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ ఇలా రాశారు : He is not dead - How can he die who made Immortal things for us, drunk with the bright Nectar of dreams, who sat alone and played Upon a golden harp of inward sight. Who revelled in dim words of light and shake Dreaming in silence of unshadowed light.. ''మరణం లేని చిత్రాలను అందించిన రామారావుకు మరణం లేదు. ఆయన రంగుల కలల్ని సేవించాడు, నీడ లేని దీపం దగ్గర ఆత్మా గీతాల్ని ఆలపించాడు. రామారావు మరణించాడంటే ఎవరు నమ్ముతారు!'' మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ..
'జీవములు వోసి, బొమ్మల జేసే నొకడు
బొమ్మలను గీసి, జీవముల్‌ వోసి నొకడు
రాముడతడు, దామెర్ల రాముడితడు

        లేవు కాలావధులు చిత్ర లీలలందు' అని నివాళ్లు అర్పించారు. తాను పాదు చేసి నీరు పోసిన మొక్క వృక్షం కాకుండా పోయిందని' కుల్డ్రే చాలా ఆవేదనకు గురయ్యారు. ఆయన మరణానంతరం ఆంధ్ర చిత్రకారులకు స్ఫూర్తిగా వంకాయల వారి వీధిలోనే దామెర్ల రామారావు ఆర్ట్‌ గ్యాలరీ రూపుదిద్దుకుంది. తరువాత ఆ ఆర్ట్‌ గ్యాలరీని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సమీపంలో నిర్మించిన భవనంలోకి తరలించారు. 1954 జూన్‌ 23న దుర్గాబాయి దేశముఖ్‌ దామెర్ల రామారావు ఆర్ట్‌ గ్యాలరీని ప్రారంభించారు. అందులో దామెర్ల వారి 183 వాటర్‌ కలర్‌ చిత్రాలు, 3 డజన్ల ఆయిల్‌ కలర్‌ పెయింటింగ్స్‌, 475 పెన్సిల్‌ స్కెచ్‌ చిత్రాలు, 25కి పైగా స్కెచ్‌ పుస్తకాలు ఉన్నాయి. ఇతర చిత్రకారులు రూపొందించిన 36 చిత్రాలను కూడా ఇక్కడ భద్రపరిచారు. దామెర్ల వెంకట్రావు, అవసరాల రామారావు ఈ ఆర్ట్‌ గ్యాలరీ నిర్వహణలో కీలక పాత్ర వహించారు. ఇక్కడ భవనం శిధిలావస్థకు చేరడంతో ఆనాటి ఎంపీ కెవిఆర్‌ చౌదరి నిధులు కేటాయించడంతో కొత్త భవనం ఏర్పడింది. ఈ భవనాన్ని 1996 మార్చి 17న ప్రారంభించారు. సీనియర్‌ న్యాయవాది చిత్రపు గురు రాజారావు తదితరుల సారధ్యంలో ప్రతియేటా వేసవిలో దామెర్ల ఆర్ట్‌ అకాడమీ ఆధ్వర్యాన చిత్రకళా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. కళకు, కళాకారులకు మరణం ఉండదు. దామెర్ల రామారావు ఎందరో ప్రస్తుత కళాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు.
            - రేగుళ్ళ మల్లికార్జున రావు ,  సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ
                                   94916 59899