కవయిత్రి డాక్టర్ కాళ్లకూరి శైలజ తొలి కవితా సంపుటి 'కొంగలు గూటికి చేరేవేళ'. 'అనల్ప' ప్రచురణ సంస్థ అందిస్తున్న 29వ పుస్తకం ఇది. ఈ సంపుటిలోని కవితలను ఊదాపూలు, నా చుట్టూ, వ్యధార్థ గాథలు, అస్తిత్వం అనే విభాగాలుగా ఇచ్చారు. ఇది మొత్తం 38 కవితల సమాహారం. కవులెవరూ పనిగట్టుకు రాయరు. మనసును చిలికే ఒకానొక ఆహ్లాద సందర్భమో, హృదయాన్ని వేధించే ఒకానొక బాధాతప్త సన్నివేశమో ఎదురైనప్పుడు రాయకుండా ఉండలేక రాస్తారు. ఈ కవితలన్నీ అలా వచ్చినవే!
తొలిచూలు ప్రేమ చాలా గొప్పది. ఎన్నో ఆశల ప్రతిఫలం. ఆ తల్లిదండ్రుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుంది. ఆ బిడ్డ చక్కగా ఎదిగి, ఉన్నత విద్యావంతుడై, సంస్కారవంతుడై, కళ్ళ ఎదుట కదలాడుతుంటే తల్లిదండ్రులు పొందే ఆనందమే వేరు. అయితే ఆ బిడ్డ అర్ధాంతరంగా దూరమైతే ఆ తల్లి హృదయం ఎంత విలవిల్లాడిపోతుందో! డాక్టర్ శైలజ గారి విషయంలో అదే జరిగింది. వారి పెద్దబ్బాయి ప్రమాదంలో కన్నుమూశాడు. ఆ ఆవేదనే వారి తొలి మూడు కవితల్లో ప్రస్ఫుటమవుతుంది. ముందుమాటలో సీతారాం అన్నట్లు 'కన్నీళ్ళు దాయడానికి పదాలను మించిన సురక్షిత స్థలాలు లేవు ప్రపంచంలో..'
'ఒక అమ్మాయిని అమ్మను చేసి/ ఒక తండ్రికి పుత్రోత్సాహమై/ ఒక ఇంట కేరింతై../ బతుకు తీరాన్ని తాకిన విశేషం, వాడు..'' అటువంటివాడు 'నూనూగు మీసానికి/ రెండు కత్తెర్లైనా పడ్డాయో లేదో/ చిటికలో చివరి అంకం చూపించి/ వీడ్కోలు చెప్పని ముగింపు/ విసిరేసిపోయాడు..' బహుశా ఆ విత్తు మరెక్కడో మొలకెత్తే ఉంటుంది అంటూ వాపోతారు. 'జన్మలే నిజమైతే../ ఈసారి నిన్ను మరింత ప్రేమిస్తాను..' అంటారు. మళ్ళీ ఆ బిడ్డకు దగ్గరవ్వాలన్న ఆకాంక్ష ఆ తల్లి హృదయంలో గాఢంగా పెనవేసుకొంటుంది.
ఒక సామాన్య వస్తువు అసామాన్య వస్తువుగా మారటాన్ని కవితామయం చేస్తూ.. 'వెదురంటే నాకు ప్రియం/ నెయ్యపు బాసలు నెమరువేసే/ మురళిగా మారుతుంది../ వెదురొక ఇంద్రజాలం/ ఎప్పటికో తల ఎత్తి, నెమ్మదిగా ఎదిగి/ తాను చేరే పెదవిని కలగంటుంది..' అంటారు.
చిన్నప్పుడు ఎక్కడో చదువుకొంటూ సెలవులకు ఇంటికి వచ్చినపుడు అమ్మానాన్నలతో, తోడబుట్టినవాళ్ళతో కలిసి వెన్నెల్లో మేడపై అందరూ కలిసి భోజనాలు చెయ్యటం ఒక మరచిపోలేని అనుభూతి. ఒక మంచి జ్ఞాపకం. చాలామందికి ఇది అనుభవమే. ఈ అనుభవానికే.. 'అప్పుడు' అనే శీర్షికతో.. ఇలా అక్షర రూపాన్నిస్తారు కవయిత్రి. 'సెలవుల్లో అమ్మానాన్నా ఇల్లొక/ జ్ఞాపకాల పుస్తకం/ సంతకం లేని ప్రేమలేఖలా.. మరుగైన గతం..' అంటారు. స్నేహంలో అప్పుడప్పుడు మాటపట్టింపులు, అపార్ధపు పీడలు అడ్డు తగులుతూంటాయి. చిన్నప్పుడూ, పెద్దయ్యాక కూడా.. వాటిని ఎలా దాటుకొంటూ వెళ్ళాలో 'దోస్తీ' అనే కవితలో ఇలా చెపుతారు : 'మాట పట్టింపుల గొంగళిని/ సహనం గూటిలో పొదిగి/ స్నేహాన్ని సీతాకోకచిలుకలా/ ఎగరనివ్వాలి../ దోస్తీకి నమ్మకమే పునాది..!
శైలజ గారికి పిల్లలన్నా, పసిపాపలన్నా అమితమైన ఇష్టం. బుజ్జాయి పారాడిన ఇంట జీవితం ఆనంద నాట్యం చేస్తుందంటారు. బిడ్డను కనటమంటే తల్లికి ఒక పునర్జన్మే. అయినప్పటికీ ఎన్ని కష్టాలకోర్చైనా మళ్ళీ అనురాగ దీక్షకు సిద్ధం కావాలనిపిస్తుంది అనటంలో ఒక స్త్రీ మాతృత్వాన్ని ఎంత ఇష్టపడుతుందో తెలుస్తుంది.
నగరం ఎంత వ్యాపారమయం అయిపోయిందో, ఎంత కృత్రిమంగా తయారయిందో 'చీకటి కవల' అనే కవితలో ఇలా చెపుతారు : 'పరువు పాచికలాటకు/ మనిషిని బానిసను చేసే/ జూదగృహం పట్నం..' అని అనటమే కాదు, పక్కవాడిని తొక్కి మరీ పైకిలేచే అన్యాయం నగరంలో చట్టబద్ధమైపోయిందంటారు. మోసం మోహం కలనేసిన మలిన వస్త్రంగా నగరాన్ని వర్ణిస్తారు. ఈ కవయిత్రి ఋతువుల్ని ఎంతో పరిశీలనాత్మకంగా, చాలా ఇష్టంగా వర్ణిస్తారు. హేమంతాన్ని వర్ణిస్తూ - 'కొంగలు గూటికిచేరేవేళ/ కమ్ముకొచ్చే చీకట్లను చీల్చే/ రెక్కల అల్లార్పులన్నీ../ నా కనురెప్పల కదలికలే..' అంటూ ఒక సరికొత్త పోలికను తెస్తారు. 'శీతగాలి రేపే మెత్తని గాయాలే ప్రతియేటా నేను జీవించి ఉన్న ఋజువు' అంటారు చలిగుర్తుల్ని నెమరువేసుకొంటూ. ఇక వర్షాకాలంలో తుపానులు, వాయు గుండాలు ప్రతి సంవత్సరం ప్రజల్ని నరకయాతన పెడుతూనే ఉంటాయి. అలా వాయుగుండం కౌగిలింతకు ఊపిరాడని పల్లెల్ని గురించి చెపుతూ 'ఇరుకు గదుల్లో జీవితం రేయి/ తెల్లారాకనే చూడాలి/ రైతుగుండె వణికే చేలు/ చెదరిన గూడు ఆ ఇల్లాలి నిట్టూర్పు/ పొయ్యి ఆనవాలు లేదు/ ఇల్లు జలమయం' అంటారు. తుపాను తీరం దాటడాన్ని గూర్చి చెపుతూ.. 'భూకబ్జాకు బయలుదేరిన సంద్రానికి ఈదురు గాలుల చప్పుళ్ళు నేపథ్య సంగీతంలా' ఉన్నాయంటారు. ఋతువర్ణనలో శ్రీ కృష్ణ దేవరాయలది ఒక విలక్షణ శైలి. చాలా నిశితమైన పరిశీలన ఆయన వర్ణనల్లో కనిపిస్తుంది. వర్షరుతువులో రాత్రి అతిధి ఇంటికి వస్తే ఆ ఇల్లాలి అవస్థ చూడాలి. 'ఇల్లిల్లు దిరుగ నొక్కంత శిఖి యబ్బె' అంటాడు. శైలజ గారి ఋతువర్ణనల్లో కూడా అంతటి నిశిత పరిశీలన కనిపిస్తుంది.
రిక్షావోడు, గొడుగులోడు, పూలకుర్రోడు, పోస్ట్ మాన్ ... ఇలా ఎవ్వరైనా కవిదృష్టిలోకి రావొచ్చు. ఇతరులెవ్వరికీ అనిపించని, కనిపించని కవితావస్తువు కూడా ఒక్కో కవి దృష్టిలో పడుతుంది. అలా శైలజ గారి దష్టిలో పడ్డాడు ఒక గూర్ఖా. 'రేపటి పరీక్షకు రాత్రి పునశ్చరణ వేళ/ నేస్తమై ఉత్సాహం నింపే ఈల సవ్వడి/ రాత్రి విధుల్లో ఒంటరి పరుగు వేళ/ రహదారి మలుపున కానవచ్చే../ మనసున్న అన్న../ నిద్రపట్టని మలిసంధ్యలో/ మూడో ఝామున గేటుపై/ క్రమం తప్పని పలకరింపు...' అంటూ 'అజ్ఞాతవీరుడు' అనే కవితలో గూర్ఖాని పాఠకులకు కూడా ఎంతో ఆత్మీయుణ్ణి చేస్తారు. వృద్ధుల గురించిఓ కవితలో రాస్తూ.. 'పరిచయస్తుల రాకతోనే ముఖం మీది చీకటి ముడతలు వెలిగి విప్పారుతాయి, వైద్యం తగ్గించని నొప్పి కబుర్లతో మాయమవుతుంది, ఔషధం ఇవ్వని శాంతి పలుకరిస్తే ప్రత్యక్షమవుతుంది' అంటూ ఒక డాక్టరుగా వృద్ధులకు వైద్యం కన్నా, మందుల కన్నా ఆత్మీయుల పలకరింపులే అసలైన ఔషధాలని చెపుతారు. సరిహద్దు రేఖ గురించి చెపుతూ ...' రెండు దేశాల నడుమ సరిహద్దు రేఖ/ రెండువైపులా పేలే తుపాకీలా ఉంటుంది' అంటారు.
ఒక డాక్టర్ ... కవి, సాహితీప్రియులు అయితే నిజంగా ఆ పేషెంట్స్ అదృష్టవంతులవుతారు. డాక్టర్ శైలజ గారు, మరణానికి చేరువైన ఎందరో పేషెంట్స్‌కు ట్రీట్‌మెంట్ చేశారు. బతికించారు. యాక్సిడెంటయి కొన ఊపిరితో ఉన్నవారికి, చెరసాలల్లో అనారోగ్యం పాలై హాస్పిటల్‌లో చేరిన ఖైదీలకు వైద్యం చేశారు. అలా ట్రీట్ చేసేటప్పుడు కలిగిన ఫీలింగ్స్‌ని ఎంతో ఆర్ద్రంగా అక్షరబద్ధం చేశారు. 'దగ్ధ పరిమళం' అనే కవిత హృదయాన్ని లుంగ చుట్టేస్తుంది. భర్త అనే కర్కోటకుడి చేతిలో దహించుకు పోయిన యువతి పరిస్థితినీ, ఆమెనా పరిస్థితికి తీసుకువచ్చి కూడా తప్పించుకుపోయే మగవాడి నిర్దయను, నిర్లక్ష్యాన్ని ఈ కవితలో చాలా వాడిగా, సూటిగా చెపుతారు. 'అన్నం వండిన చేయి మోడై/ మరణ వాంగ్మూలంలో/ సంతకం పెట్టలేక../ నిరాశ తెరవెనుక నుంచి సైతం/ క్షమాభిక్ష పెట్టేందుకు గొంతు/ సవరించుకొంటుంది../ కాబోయే పెళ్ళి కొడుకు మాత్రం/ తెలివిగా తప్పించుకొంటాడు..' అనటంలో భర్త దౌష్ట్యానికి గురై కూడా అతడికి శిక్ష పడకూడదనే ఆమె మంచితనం, వాడు మాత్రం వెంటనే మరో పెళ్ళికి సిద్ధమౌతాడనే వ్యంగ్యం ప్రస్ఫుటమవుతాయి.
'తొలి ఊపిరి' కవితలో తల్లి కాబోయే స్త్రీ పడే పురిటినొప్పులు, ఆ నొప్పులే బిడ్డపుట్టగానే చిరునవ్వులై, పడిన బాధ ఆనందమై తొమ్మిది నెలల ఎదురుచూపు ఫలించటాన్ని కవయిత్రి ఒక డాక్టరే కాకుండా, ఒక అమ్మ కూడా కాబట్టి రాయగలిగారేమో అనిపిస్తుంది. ఆసుపత్రిలోని వార్డుబారు, తోటీ, సెక్యూరిటీ, దాయీ, నర్సులు, యువవైద్యులు అందరూ ప్రాణరక్షణకి ఎలా నడుం కడతారో చెపుతూ ఆసుపత్రిని ఒక ఉద్యమంగా, ఆఖరిక్షణం వరకూ పోరాడే అత్యున్నత పోరుభూమిగా, ప్రాణాన్ని కానుకగా ఇచ్చే దివ్యలోకంగా వర్ణిస్తారు.
డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ముందుమాటలో చెప్పినట్లు ... కవి తాను తిరిగినంత మేరా ప్రతి అనుభవాన్ని కవిత్వంలోకి అనువదించుకొంటాడు. డాక్టర్ శైలజగారు అలా అనేక అనుభవాల్ని కవిత్వంలోకి ఒలికించారు. ఒక డాక్టర్‌గా మనకు తెలీని ఎన్నో అంశాల్ని కవితామయం చేసారు. కవి ఆత్మీయత, వ్యక్తిత్వం తన రచనల్లో తప్పక ప్రస్ఫుటమవుతాయి. ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితా డాక్టర్ శైలజ గారు ఎంత సున్నిత మనస్కులో, పేషెంట్లతో సహానుభూతిని పొందే ఎంత మంచి మనసున్న వైద్యురాలో మనకు అర్థమవుతుంది. వారి నుంచి మరిన్ని కవితా సంపుటులు రావాలని కోరుకుందాం.
- డాక్టర్ జోస్యుల కృష్ణబాబు -98664 54340










