హరారే : ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఎన్నికల కోసం జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ ఎనంగాగ్వా శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ - పేట్రియాటిక్ ఫ్రంట్ (జెడ్‌ఎఎన్‌యు-పిఎఫ్) పార్టీ తరపున ఆ దేశాధ్యక్షుడుగా ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆయన మొదటిసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీన జరిగే ఎన్నికల్లో మరోసారి గెలుపొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రాజధాని హరారే నుండి దాదాపు 440 కి.మీ దూరంలో చిపింగ్‌లో జెడ్‌ఎఎన్‌యు-పిఎఫ్ పార్టీ మొదటి ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో అధ్యక్షుడు ఎమర్సన్ ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రం తెచ్చిన అధికార పార్టీకి ఓటువేయాలని ఆయన కోరారు. అలాగే 2017లో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లనుద్దేశించి మాట్లాడుతూ... 'మేము ఇంధన సంక్షోభాన్ని, విద్యుత్ కొరత, ఆహార భద్రత సమస్యను పరిష్కరించాము. చాలా తక్కువ కాలంలోనే వ్యవసాయ పరిశ్రమను 3.8 బిలియన్ డాలర్ల నుండి 8 బిలియన్ డాలర్లకు పెంచాము. రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి స్థానిక వనరులను సమీకరించే మార్గాలను కొనసాగిస్తాము' అని ఆయన అన్నారు. అలాగే రెండు దశాబ్దాల క్రితం పాశ్చాత్య దేశాలు జింబాబ్వేపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా దేశాభివృద్ధికి వ్యతిరేకంగా జింబాబ్వేలు ఆగిపోకూడదు. ఎన్నికల సమయంలో శాంతిని పాటించాలి' అని ఎమర్సన్ ప్రజలనుద్దేశించి అన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో 11 మంది అధ్యక్ష అభ్యర్థులకు పోటీ చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.










