Jun 29,2023 07:58

మిన్స్క్‌ : వాగ్నర్ మిలటరీ గ్రూప్‌ అధినేత యెవ్‌గనీ ప్రిగొజిన్‌ ప్రస్తుతం బెలారస్‌లోనే వున్నారని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుక షెంకో ధ్రువీకరించారు. వాగ్నర్ గ్రూపు సభ్యులు కావాలంటే బెలారస్‌కి వెళ్ళవచ్చని, రష్యా మిలటరీతో చేరవచ్చని లేదా ఇంటికి వెళ్ళిపోవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భద్రతా హామీలిచ్చారు. ఆ హామీల మేరకే, వాగ్నర్ సభ్యులు కొంత కాలం పాటు బెలారస్‌లో వారి స్వంత ఖర్చులతో వుండేందుకు లుకాషెంకో అనుమతించారని ప్రభుత్వ వార్తాసంస్థ బెల్టా తెలిపింది. ప్రిగోజిన్‌తో ఫోన్‌లో మాట్లాడానని, తిరుగుబాటుకు దిగాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి ఒప్పించినట్లు లుకాషెంకో మంగళవారం తెలిపారు. బెలారస్‌లో పనికిరాని ఒక సైనిక స్థావరంలో తలదాచుకోవాల్సిందిగా వాగ్నర్ నేతకు చెప్పినట్లు లుకాషెంకో తెలిపారు. ప్రిగొజిన్‌ విషయంలో తొందరపడవద్దని, పరిస్థితి అదుపు తప్పుతుందని పుతిన్‌కు చెప్పినట్లు లుకాషెంకో చెప్పారు. అలాగే ప్రిగొజిన్‌తో కూడా మాట్లాడానని, మాస్కోపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే పురుగులా నలిపివేస్తారని హెచ్చరించానని చెప్పారు. పైగా ప్రిగొజిన్‌ చేసే డిమాండ్లకు క్రెమ్లిన్‌ ఎన్నడూ అంగీకరించదని స్పష్టం చేసినట్లు తెలిపారు.

  • రక్తపాతాన్ని నివారించేందుకే తక్షణ చర్యలు : పుతిన్‌

వాగ్నర్ సమస్యను పరిష్కరించడంలో సమైక్యత, సంఘీభావంతో వ్యవహరించినందుకు దేశ ప్రజలకు పుతిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రక్తపాతాన్ని నివారించేందుకే తక్షణ చర్యలు చేపట్టామన్నారు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వాలని, తమ చర్యలను సమాజం తిరస్కరించిందని వారు తెలుసుకోవాలని పుతిన్‌ వ్యాఖ్యానించారు. తిరుగుబాటుదారులను ముందుకు రాకుండా ఆపడంలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన పైలట్ల సంస్మరణార్ధం ఒక నిముషం మౌనం పాటించారు.
గత ఏడాది కాలంలో వాగ్నర్ సైనికుల వేతనాలు, ఇతర సదుపాయాల నిమిత్తం వంద కోట్ల డాలర్లకు పైగా వారికి చెల్లించినట్లు పుతిన్‌ తెలిపారు. మాస్కోలో ఒక సైనిక సమావేశంలో మాట్లాడుతూ పుతిన్‌ ఈ వివరాలు తెలిపారు. అలాగే ప్రిగొజిన్‌కి చెందిన కాంకర్డ్‌ గ్రూపు రష్యా సైన్యానికి ఆహారం అందించే కాంట్రాక్టు నుండి కూడా దాదాపు మరో వంద కోట్ల డాలర్లను పొందింది.