- చైనాలో బెలారస్ అధ్యక్షుడు పర్యటన
బీజింగ్ : చైనాలో మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం వచ్చిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సాదరంగా స్వాగతం పలికారు. 2022 సెప్టెంబరులో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ది చెందిన తర్వాత ఆ దేశాల మధ్య అవిచ్ఛన్నమైన స్నేహ బంధం కొనసాగుతోంది. ఇరువురు దేశాధినేతలు చర్చలు జరిపిన తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొత్త శకంలో బెలారస్, చైనాల మధ్య అన్ని పరిస్థితులను తట్టుకొనగలిగే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను అభివృద్ధిపరిచే ప్రధాన సూత్రాలపై వారు ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో సహకారానికి సంబంధించి పలు పత్రాలపై సంతకాలు చేశారు. అనుకున్న సమయం కన్నా మించి ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారని బెలారస్ మీడియా పేర్కొంది. ఆర్థికం, వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కస్టమ్స్, సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, అంతర ప్రాంత సహకారంపై ఈ ఒప్పందాలు కుదిరాయి. తైవాన్, జిన్‌జియాంగ్, హాంకాంగ్, మానవ హక్కులు వంటి అంశాలపై చైనా వైఖరికి బెలారస్ గట్టి మద్దతు ఇవ్వడాన్ని జిన్‌పింగ్ అభినందించారు. ఇరు దేశాలు వారి దేశాల్లో అనుసరించే అభివృద్ధి పంథాకు పరస్పరం మద్దతునిచ్చుకోవాలని, వారి వారి కీలకమైన ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని, అంతర్గత వ్యవహారాల్లో బయటి జోక్యాన్ని వ్యతిరేకించాలని, వారి సార్వభౌమాధికారం, రాజకీయ భద్రతను కాపాడుకోవాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని విస్తరించుకోవడానికి ఉభయ పక్షాలు అంగీకరించాయి.










