న్కూయార్క్ : అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆహార సాయం నిలిపివేయడంతో ఇథియోపియోలోని ఉత్తర టిగ్రే ప్రాంతంలో ఆకలి కేకలు విజృంభిస్తున్నాయి. ఆకలితో 700 మంది పైగా మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఆహార సాయంగా అందిస్తున్న గోధుమలు, ఇతర పదార్థాలు దొంగతానికి గురవుతున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది మార్చిలో టిగ్రేకు ఆహార సాయాన్ని అమెరికా, ఐరాస నిలిపివేశాయి. ఈ నిలిపివేతను జూన్‌లోనూ పొడిగించారు. దీంతో సుమారు 2 కోట్ల మంది ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. ఆహార సాయం నిలిపివేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ టిగ్రేలో 728 మంది మరణించారని చెప్పారు. ఇంకా అనేక మంది చావు బతుకుల మధ్య ఉన్నారని చెప్పారు. అలాగే అనేక మంది ఇతర ప్రాంతాలకు ఆహారం కోసం తరలివెళ్లిపోతున్నారని తెలిపారు. అంతర్యుద్ధం కారణంగా సమారు రెండేళ్ల నుంచి ఇథియోపియోలో ఆహార సంక్షోభం ఏర్పడింది. సాయంగా అందచేసిన ఆహార పదార్థాలు స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి సిద్ధంగా ఉంటూ దొరికాయని చెబుతూ అమెరికా, ఐరాసలు ఆహార సాయాన్ని నిలిపివేశాయి.










