Jun 28,2023 16:24

ప్రీటౌన్‌   :   ప్రస్తుత అధ్యక్షుడు మరియు అధికార సియెర్రా లియోన్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి జూలియస్‌ మాదా బయో రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం సుమారు 77 శాతం పోలింగ్‌ నమోదవగా, జూలియస్‌ మాదా బయో 56.17 శాతం ఓట్లను గెలుచుకోగా , ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి సమురా కమరా 4.16 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచినట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. దీంతో జూలియస్ మాదా  రెండో సారి ఐదేళ్ల పదవీకాలాన్ని చేపట్టినట్లు సియోర్రా లియోన్‌ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.

తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన జూలియస్‌ మాదాతో ఆదేశ ప్రధాన న్యాయమూర్తి డెస్మండ్‌ బాబా తుండే ఎడ్వర్డ్స్‌ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రెండవ పదవీకాలంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా అభివృద్ధి ఎజెండాను కొనసాగిస్తానని అన్నారు. తమ భాషలు, తెగలు, రాజకీయ విశ్వాసాలు విభిన్నంగా ఉన్నప్పటికీ.. దేశం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో తాము ఐక్యంగా ఉన్నామని ఈ విజయం మరోసారి నిరూపించిందని అన్నారు. ఆహార భద్రత, మానవ మూలధన అభివృద్ధిని ఏకీకృతం చేయడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, పౌరసేవలను పునరుద్ధరించడం, సాంకేతికత, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలపై ఆల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సమురా కమరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు నమ్మదగినవి కావని, ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు సమురా కమరా ప్రకటించారు. సియోర్రా లియోన్‌లో ఎన్నికల కమిషన్‌ ఈ నెల 24న అధ్యక్ష, పార్లమెంట్‌, పురపాలక ఎన్నికలను నిర్వహించింది. స్థానిక చట్టాల నిబంధనల ప్రకారం.. అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీలో కొనసాగుతున్న అభ్యర్థి తప్పనిసరిగా 55 శాతం ఓట్లను పొందాల్సి వుంది.