లాహోర్ : పాకిస్తాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 20 మృతి చెందారని పాక్ మీడియా ఛానెల్ డాన్ మంగళవారం పేర్కొంది. దాదాపు ఈ ప్రావిన్స్‌లో విద్యుద్ఘాతం, పిడుగుపాటు వల్లే మరణాలు సంభవించాయని పంజాబ్ ప్రావిన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి ఫరూక్ అహ్మద్ తాజాగా ప్రకటనను విడుదల చేశారు. పిడుగుపాటుకు గురై నరోవల్‌లలో ఐదుగురు, షేక్‌పురాలో ఇద్దరు మృతి చెందినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఏడుగురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారని, మరో ఆరుగురు విద్యుద్ఘాతంతో మృతి చెందారని ఆ ప్రకటన తెలిపింది. ఇక ఈ ప్రమాదాల వల్లే కాకుండా.. లాహోర్‌లో గోడ, పైకప్పు కూలిన ఘటనలలో దాదాపు 10 మంది, చినియోట్‌లో ముగ్గురు చనిపోయారు. షేక్‌పురాలో ఒకరు గాయపడినట్లు ఫరూక్ అహ్మద్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. ఇక వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు గురై ఏడుగురు గాయపడ్డారు.
కాగా, దాదాపు 61 మంది కరెంట్ షాక్‌కి గురై పంజాబ్ ప్రావిన్స్‌లోని ఆసుపత్రుల్లో చేరారని, వారిలో 54 మందికి అత్యవసర చికిత్స అందించబడిందని ఫరూక్ అహ్మద్ ప్రకటన పేర్కొంది. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలయమయ్యాయమని, మోకాళ్ల లోతు నీటిలో ప్రజలంతా తిరుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.










