Jun 26,2023 18:33

కాన్బెర్రా : రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కి ఆస్ట్రేలియా ప్రభుత్వం సహాయం చేస్తోంది. తాజాగా రష్యా దాడికి వ్యతిరేకంగా రక్షించడానికి 70 సైనిక వాహనాలతో సహా 73.5 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ఉక్రెయిన్‌కి అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరి నుంచి జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో తాము ఉక్రెయిన్‌కి 790 మిలియన్‌ డాలర్ల మేర సహాయం చేయనున్నట్లు.. అందులో 610 మిలియన్‌ డాలర్లు సైనిక సహకారానికే కేటాయిస్తున్నట్లు ఆంథోనీ తెలిపారు. అయితే ఈ ప్యాకేజీ రష్యాలో వాగర్‌ ప్రైవేట్‌ మిలటరీ బలగాలు చేసిన దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కి సహాయం అందించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కి అందించే ప్యాకేజీ ప్రతిపాదనపై గతం నుంచే చర్చిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థను, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఉక్రెయిన్‌ నుండి దిగుమతి చేసుకునే వస్తువులకు చెల్లించే పన్నుకు మినహాయింపు ఇస్తున్నట్లు.. ప్రస్తుతమున్న పన్ను మినహాయింపు కూడా మరో 12 నెలలపాటు గడువును పెంతున్నట్లు ఆల్బనీస్‌ చెప్పారు.
కాగా, తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉక్రెయిన్‌కి అందించిన సైనిక ప్యాకేజీలో 28ఎం113 సాయుధ వాహనాలు, 14 ప్రత్యేక ఆపరేషన్‌ వాహనాలు, 28 మీడియం ట్రక్కులు, 14 ట్రైలర్‌లు ఉక్రెయిన్‌కి అందనున్నాయి.