Jun 29,2023 07:51

బ్రసీలియా : చమురు శుద్ధి కర్మాగారం 'లుబ్నార్‌ రిఫైనరీ' విక్రయానికి వ్యతిరేకంగా బ్రెజిల్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. సియారా నగరంలో ఉన్న లుబ్నార్‌ లూబ్రికెంట్స్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రిఫైనరీని గతేడాది 34 మిలియన్ల అమెరికన్‌ డాలర్లకు గ్రేపర్‌ పార్టిసిపాసియోస్‌కి విక్రయించింది. ఇది ఆ సంస్థ మార్కెట్‌ విలువ కన్నా 55 శాతం తక్కువ కావడం గమనార్హం. లుబ్నార్‌ 500 మంది కార్మికులను కలిగి ఉండటంతో పాటు బ్రెజిల్‌లో తారు ఉత్పత్తిలో సుమారు 10 శాతం బాధ్యత వహిస్తుంది. అలాగే నాఫ్తనిక్‌ లూబ్రికెంట్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. వీటిని అధిక వోల్టేజీ ట్రాన్స్‌ఫార్మర్లు, వెహికల్‌ షాక్‌ అబ్జార్బర్‌లు మరియు థర్మల్‌ ఇన్సులేషన్‌లో వినియోగిస్తారు.
లుబ్నార్‌ స్థానిక సంస్థలకు డీజిల్‌, గాసోలిన్‌, ఏవియేషన్‌ కిరోసిన్‌ను సరఫరా చేస్తుందని యునిఫైడ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆయిల్‌ వర్కర్స్‌ (ఎఫ్‌యుపి) కోఆర్డినేటర్‌ డెవిడ్‌ బాసెలర్‌ పేర్కొన్నారు. ఇతర రిఫైనరీలు, టెర్మినల్స్‌ నుండి ఎల్‌పిజిని నౌకల ద్వారా పోర్టులకు రవాణా చేయడంతో పాటు తీర ప్రాంత కార్యకలాపాలతో పాటు దిగుమతులు చేపడుతుంది. లుబ్నార్‌ విక్రయంతో నౌకల కొరత ఏర్పడుతుందని, ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. లుబ్నార్‌ను ప్రైవేటీకరించడం వల్ల సియారా రాష్ట్రంపై గుత్తాధిపత్యం ఏర్పడుతుందని సిండిపెట్రో -సిఇ/పిఐ అధ్యక్షుడు ఫెర్నాండేజ్‌ నెటో హెచ్చరించారు. ప్రైవేట్‌ కంపెనీ స్థానిక మార్కెట్‌కు సరఫరా చేయడం కన్నా లాభదాయకమైన ఎగుమతులు, దిగుమతులపై దృష్టి సారిస్తుందని అన్నారు.