Jul 21,2021 06:29

ఇటీవల తిరువనంతపురంలో ఒక మహిళ తన కుమారుణ్ణి దేవుడికి బలిచ్చింది. మొన్న ఒక మహిళ దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య చేసుకుంది. మదనపల్లి జంటహత్యల మాటున ఏ బాబా బోధనలు దాగి వున్నాయో ప్రభుత్వం నిగ్గుతేల్చలేక చేతులు ఎత్తేసింది. జనవరిలో ఇద్దరు బాలికలను వారి తల్లిదండ్రులే అత్యంత కిరాతకంగా చంపటానికి ప్రేరేపించబడిన అతీంద్రీయ శక్తులు ఏవి? హైదరాబాద్‌లోని డాక్టర్లు ఆ మధ్య మృత్యుంజయ యాగం చేశారు. మూడు సంవత్సరాల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఏసుప్రభు పిలుస్తున్నాడంటూ ముగ్గురు మహిళలు ఉరి వేసుకొని చనిపొయారు. అదే సమయంలో ఢిల్లీలో ఎవరో స్వామి చెప్పాడని మోక్షం కోసం పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత దుర్మార్గాలు దేశంలో జరుగుతుంటే వాటిని అరికట్టవలసిన మన నాయకులు ఎం చేస్తున్నారు? బాబాలు, పీఠాధిపతులు వారి సామ్రాజ్యాలను విస్తరించు కుంటున్నారు. ఆశ్రమాల పేరుతో నేర సామ్రాజ్యాలను స్థాపించుకుంటున్నారు. ఈ హత్యల పట్ల ఒక్క బాబాగాని, ఒక్క స్వామిగాని, ఒక్క పీఠాధిపతిగాని, ఒక్క ఫాస్టరుగాని నోరు తెరవడు. వీళ్ళు తేలుకుట్టిన దొంగల్లా ఎందుకున్నారు? ఒక్క రాజకీయ నాయకుడు నోరెత్తలేదు! ఎందుకని? మదనపల్లి హత్యలు లాంటివి ఇంక జరగకుండా, పెరగకుండా ఉండేందుకు భక్తి పేరుతో, అధ్యాత్మికం

పేరుతో బాబాల వ్యాపార కేంద్రాల గుట్టు రట్టు చెయ్యవలసిన అవసరం ఎంతైనా వుంది.
ఇంకొకపక్క కరోనా వలన ప్రజలు భయ భ్రాంతులకు గురై అష్టకష్టాలు పడుతుంటే, వారి బలహీనతలను ఆసరా చేసుకొని ఒకరు ఆవుమూత్రం తాగితే కరోనా పోతుందని, ఇంకొకరు ఆవు పేడ ఒంటికి పూసుకుంటే పోతుందని, మరొకరు గాయత్రీ మంత్రం పఠిస్తూ కూర్చుంటే కరోనా పరార్‌ అని, ఇంకొక స్వామి యాగాలు చేస్తుంటే కారోనా రాదని, ఈయన గారు చిన్నప్పటి నుండి యాగాలు చేస్తూనే ఉన్నాడు గదా! మరి కరోనా ఎందుకొచ్చిందని ఒక్కరు అడగరు. ఇంకొకరు నా వంటకం కరోనాని తగ్గిస్తుంది అనుమతి ఇవ్వండని ప్రభుత్వాలను బెదిరించటం. ఎటు పోతున్నాం మనం? ఇంకొకవైపు శాస్త్రీయ విజ్ఞానం ద్వారా కనిపెట్టిన టీవీ లలో అజ్ఞానపు బోధనలు, రంగురాళ్లు వేళ్ళకు ధరిస్తే జీవితాలు మారతాయని, పేరు మార్చుకుంటే కష్టాలు పోతాయని, అష్టలక్ష్మి యంత్రాన్ని, రుద్రాక్షలను మెడలో వేసుకుంటె అదృష్ట దేవత నెత్తినెక్కి కుర్చుంటుందని ఒకటే ఊదర. ఈ ప్రకటనలు నమ్మి ఎంతో మంది మోసపోయారు. అయినా ప్రభుత్వాలలో ఏమాత్రం స్పందనా లేదు. కనుక ప్రభుత్వం తక్షణమే మూఢ నమ్మకాల నిరోధక చట్టం ఏర్పరచి, అందులో పైన పేర్కొన్న మూఢనమ్మకాలను చేర్చి, వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

- నార్నె వెంకట సుబ్బయ్య.