May 16,2023 22:51

  • కేంద్ర మంత్రి కౌసల్‌ కిషోర్‌

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌసల్‌ కిషోర్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం సడక్‌ రోడ్‌లో వివిధ దశల్లో నిర్మాణంలో నిలిచిపోయిన ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. స్వయంగా లబ్దిదారులతో మాట్లాడిన ఆయన అధికారుల నుండి వివరాలు సేకరించి త్వరగా లబ్దిదారులకు బిల్లులు అందేలా చేయాలని నిర్మాణం కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లి మున్సిపాలిటీలో బోర్డు లేకపోవడం వల్ల రోడ్లు మరియు మౌళిక వసతులు లేవని స్థానిక బిజెపి నేతలు కేంద్రమంత్రికి వివరించారు. అధికారులతో మాట్లాడి మౌళిక సదుపాయాలు మరియు రోడ్లు సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా వరకు ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతి పేదవాడికి ఇంటి సదుపాయం కల్పించాలని సంకల్పంతో ఉన్నార న్నారు. ఆయన సూచనతోనే ఇళ్ల నిర్మాణం పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.