న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరిచాయి. మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలకు ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదని మండిపడ్డాయి. ఈ బడ్జెట్ 25 ఏళ్ల దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే బ్లూప్రింట్ అంటూ లోక్‌సభలో పద్దును ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కౌంటరిస్తూ.. ఇది 'జీరో సమ్ బడ్జెట్ (గుండు సున్నా బడ్జెట్) అని ట్వీట్ చేశారు. ' మోడీ ప్రభుత్వ బడ్జెట్ మొత్తం శూన్యం. ఇందులో వేతన జీవులు, మధ్యతరగతి, పేద, అణగారిన వర్గాలకు, యువతకు, రైతులకు, చిన్న, మధ్య, సూక్ష్మ పరిశ్రమలకు ఏమీ లేదు' అని ట్వీట్ చేశారు. ఈ బడ్జెట్ నిరాజనకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. అచ్చేదిన్ మరింత దూరంగా నెట్టివేయబడిందని, మధ్యతరగతికి ఉపశమనం లేదని అన్నారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ఈ బడ్జెట్ ఎవరి కోసమని ప్రశ్నించారు. 10 శాతం ధనవంతులు.. 75 శాతం సంపదను కలిగి ఉన్నారని, 60 శాతం పేదల వద్ద 5 శాతం మాత్రమే సంపద ఉందని అన్నారు. మహమ్మారి సమయంలో భారీగా డబ్బులు గడించిన వారిపై పన్నులు ఎందుకు వేయలేదని, నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిన నేపథ్యంలో.. ధనవంతులకు ఎక్కువ పన్ను విధించాలనిపించలేదా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ మరింత ఘాటుగా స్పందించారు. ఈ బడ్జెట్ ఊహకందని, ప్రేరణలేని, వాస్తవికతకు దూరంగా, అమలు చేయలేని విధంగా ఉందంటూ పేర్కొన్నారు. కరోనా సమయంలో ఉపశమనం కల్పిస్తారని వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు ఎదురుచూశారని, కానీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రధాన మంత్రి.. వారిని నిరాశకు గురి చేసి, వారికి ద్రోహం చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఈ బడ్జెట్‌పై స్పందించారు. సీతారామన్ ప్రసంగంలో ఇవే ప్రస్తావించారంటూ ఒకే ఒక్క అంశానికి టిక్ కొట్టారు. క్లైమెట్ యాక్షన్ మినహాయించి.. వేరే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. తృణమూల్ నేత డెరెక్ ఒబ్రెయిన్ స్పందిస్తూ.. వజ్రాలు ఈ ప్రభుత్వానికి స్నేహితులనుకుంటా.. అందుకే వాటిపై ఉపశమనం కల్పించి.. మిగిలిన రైతులు, మధ్యతరగతి, రోజువారీ వేతనజీవులు, నిరుద్యోగులకు ఏమీ చేయలేందంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో ఒకవైపు వాతావరణం, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతూ.. మరోవైపు పర్యావరణం పరంగా వినాశకరమైన నదుల అనుసంధానం చేపడుతున్నట్లు వెల్లడించారని కాంగ్రెస్ మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. మోడీ సర్కార్ విధ్వంసకర చర్యలు చేపడుతోందని అన్నారు.










