Jun 18,2023 22:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఒంటిపూట బడులను ఈ నెల 24వ తేది వరకు కొనసాగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలోఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు యాథతథంగా ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు నడుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ, 11.30 నుంచి 12.00 గంటల వరకు మధ్యాహ్నం భోజనం అందించాలని ఆదేశించారు.