పోర్ట్-అవుాప్రిన్స్ : సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పేద కరీబియన్ దేశం హైతీలో అతి పెద్ద దారుణం చోటుచేసుకుంది. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడే హత్యకు గురయ్యారు. తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ మంగళవారం రాత్రి తన సొంత నివాసంలో నిద్రిస్తున సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మోయిస్ చనిపోగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ హత్యను జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. దుండగుల చర్యను విద్వేషపూరితమైన, అమానవీయమైన, ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిలో కొంతమంది స్పానిష్ మాట్లాడుతున్నారని చెప్పారు.నాలుగున్నర కోట్ల జనాభా కలిగిన ఈ కరీబియన్ దేశం 216 ఏళ్ల క్రితం వరకు ఫ్రెంచ్ వలసపాలన నుంచి విముక్తి సాధించినప్పటికీ పాలకులు అనుసరించిన ముదనష్టపు విధానాల వల్ల 60 శాతం జనాభా ఇప్పటికీ కడు పేదరికంలో మగ్గుతున్నారు. రాజకీయ అస్థిరత, అశాంతికి నిలయంగా మారిన హైతీలో చమురు ధరల పెంపుపై 2018లో దేశవ్యాపితంగా పెద్దయెత్తున ప్రజలు పెద్దయెత్తున ఉద్యమించారు. అధ్యక్షుడు మోయిజ్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 2018లోనే మోయిజ్ అధ్యక్ష పదవీ కాలం ముగిసినప్పటికీ డిక్రీల ద్వారా ఆయన పాలనసాగిస్తూ వస్తున్నారు.










