ప్రజాశక్తి - హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తాజాగా హైదరాబాద్‌కు వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీం దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా హైదరాబాద్, పుణే నగరాల్లోనూ అందించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్కీం అమలు కోసం జపాన్ ఒరిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పద్ధతిలో కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవడానికి వీలుంది. అయితే నిర్వహణ ఛార్జీల కింద ప్రతీ నెల కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో తొలుత ఈ స్కీం ప్రారంభమైంది. నెలవారీ కొంతమొత్తం చెల్లిస్తే మిగతా కారు నిర్వహణ, బీమా, రోడ్ సైడ్ అసిస్ట్ వంటివి కంపెనీ బాధ్యతనే. ఈ స్కీమ్‌లో స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6 తదితర మోడల్ కార్లు లభ్యమవుతాయి. ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన కొన్ని వారాల్లోనే తాము వినియోగదారుల నుంచి అనూహ్య స్పందనను అందుకున్నామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దశల వారీగా, రానున్న 2-3 ఏళ్లలో 40-60 నగరాల్లో మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యాన్ని తాము కలిగి ఉన్నామన్నారు.










