Nov 23,2022 22:52

కేరళ పోలీసుల నుంచి అభినందనలు

ప్రజాశక్తి -హిందూపురం : కేరళలో ఏకంగా రూ.1.4 కోట్ల దొంగతనంలో ప్రధాన నిందితుడు వారి ముఠా సభ్యులను పట్టుకోవడంలో సిట్‌కు సహకరించిన హిందూపురం పోలీసులు కేరళ పోలీస్‌ శాఖ నుంచి ప్రశంసలు అందుకున్నారు. కేరళలోని వాయినాడ్‌ జిల్లాలో ఇటీవల ఓ భారీ దోపిడీ జరిగింది. ఈ కేసును చేధించడానికి అక్కడి ఉన్నతాధికారులు సిట్‌ బందాన్ని ఏర్పాటు చేశారు. దోపిడీలో ప్రధాన నిందితుడు హిందూపురం పట్టణానికి వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులు హిందూపురానికి వచ్చి ఈ కేసులో తమకు సహకరించాలంటూ రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సిఐ వెంకటేశ్వర్లును కోరారు. నిందితులు పట్టణంలోని మోడల్‌ కాలనీలో ఓ ఇంట్లో తల దాచుకుంటున్నట్లు ఇక్కడి పోలీసులు గుర్తించారు. వారు ఘరానా దొంగలు కావడంతో తప్పించుకునే అవకాశం ఉందని కానిస్టేబుల్‌ శ్రీరాములు, రాధ ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా వారు తప్పించుకుని బెంగళూరు పారిపోయారు. అయితే వారికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చినవారి నుంచి కీలక సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అతని ముఠాను కేరళ పోలీసులు పట్టుకునేలా సహకరించారు. భారీ దోపిడీ కేసును చేదించడానికి సహకరించిన హిందూపురం పోలీసులకు అభినందనలు వెళ్లువెత్తాయి. హిందూపురం రెండవ పట్టణ సిఐ వెంకటేశ్వర్లు, పోలీసులు శ్రీరాములు, రాధకు అభినందనలు తెలుపుతూ సిట్‌ లో కీలకమైన వాయినాడు ఎస్పీ ప్రత్యేక అభినందన పత్రాన్ని బుధవారం రాత్రి జిల్లా ఎస్‌ పి కార్యాలయానికి పంపారు. హిందూపురం పోలీసుల కృషి వల్లే తాము కేసును చేదించామని అందులో పేర్కొన్నారు.