ప్రజాశక్తి - కొత్తచెరువు : ప్రభుత్వపరంగా అన్ని విధాల గొర్రెల కాపరులను ఆదుకుంటామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం లోచర్ల సమీపాన రైల్వే ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో గొర్రెలు మృతిచెందిన నేపథ్యంలో బాధిత గొర్రెలకాపరులను వారు బుధవారం పరామర్శించారు. ప్రమాదంలో 120 గొర్రెలు మృతిచెందాయని దాదాపు రూ. 12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తమను ఆదుకోవాలని బాధితులు వారిని కోరారు. గొర్రెలకు బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎటి మల్లేష్‌గౌడ్‌ను ఎంపీ, ఎమ్మెల్యే ఆదేశించారు. తక్షణ సాయం కింద బాధితులకు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామాంజనేయరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీపీలు గాయత్రి రెడ్డప్ప రెడ్డి, రమణారెడ్డి. వైస్ ఎంపీపీ గంగరాజు, నాయకులు విజయభాస్కర్, సర్పంచి గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు.










