ప్రజాశక్తి-విజయవాడ: అన్నదానానికి మించిన దానం మరొకటిలేదని, పేదల ఆకలి తీర్చి అండగా నిలుస్తున్న ద్వారావతి ఫౌండేషన్ సేవలను స్వచ్చంద సంస్థలు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి అనేక మంది ఆర్జీదారులు కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వస్తుంటారని, అటువంటి వారికి ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నవితరణ, మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు దాదాపు 200 మందికి పైగా పేదలకు అన్నదానం కార్యక్రామన్ని నిర్వహించడం సామన్యమైన విషయం కాదన్నారు. సేవ చేయాలన్న దృక్పథం ఉన్నప్పటికి వ్యయ ప్రయాసలతో ప్రతిరోజు సేవా కార్యక్రమాలలో నిమగమవడం వారి దార్శికతకు నిదర్శనమన్నారు. ప్రజల ఎండ తీవ్రత నుండి తట్టుకునేలా చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లటి తాగునీరు, మజ్జిగను పంపిణీ చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ద్వారావతి ఫౌండేషన్ చైర్మన్ జి.సంతోష్‌కుమార్ సాయి మాట్లాడుతూ తమ సంస్థ గౌరవ అధ్యక్షులు చలువాది మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా కలెక్టరేట్‌లో ఆర్జీదారుల కోసం అన్నదానం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో ఇంతియాజ్ పాషా, ద్వారావతి ఫౌండేషన్ ప్రతినిధులు వై సుధాకర్, టి బాలాజీ, డి.ఖాశీం తదితరులు పాల్గొన్నారు.
రైటప్: అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్, పక్కన జెసి...
స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
స్పందనలో నమోదయ్యే ఆర్జీలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్‌కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ ఆర్జీదారుల నుండి 86 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ఆర్జీలు సమర్పిస్తారన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, 1902 కాల్ సెంటర్, స్పందన మొబైల్ యాప్, జగనన్నకు చెబుదాం, వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదవుతున్న అర్జీలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారి పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










