May 22,2023 22:49

ప్రజాశక్తి-వన్‌టౌన్‌
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి దుర్గమ దేవస్థానం మహామండపం ఆరవ అంతస్తులో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 18 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా నగదు: రూ.3,16,30,662, బంగారం 752 గ్రాములు, వెండి: 7.628 కిలోలు యాత్రికులు సమర్పించుకున్నారు. అలాగే ఆన్‌లైన్‌ నందు ఈ- హుండీ ద్వారా రూ.20,422లు భక్తులు విరాళాలను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా హుండీ లెక్కింపునకు ఆలయ పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు బచ్చు మాధవీ కష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, దేవాదాయ శాఖ అధికారులు ఎస్‌.వి సుబ్బారావు, ఎస్‌పిఎఫ్‌ మరియు వన్‌టౌన్‌ పోలీసు సిబ్బంది హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.
దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు
దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య కుటుంబ సభ్యులు, హై కోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత సోమవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్ట్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ లక్ష్మణరావు, రిజిస్ట్రార్‌ రామకష్ణ, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి పాల్గొన్నారు. గంపలగూడెంకు చెందిన శ్రావణి ఆల్కో బ్రో ప్రై లిమిటెడ్‌ కంపెనీకి చెందిన ఇ.చంద్రారెడ్డి
దుర్గగుడికి నివేదన నిమిత్తం 2.894 కిలోల బరువు గల ఐదు వెండి గిన్నెల సెట్‌ను సోమవారం ఆలయ ఇఒ దర్భముళ్ల భ్రమరాంబని కలిసి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఎండల తీవ్రత తగ్గి, వాతావరణం చల్లబడాలని దుర్గగుడిలో సోమవారం నుండి వరుణ జపాలు, పలు పూజలు ప్రారంభించారు. రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌ సత్యనారాయణ ఆదేశాల మేరకు లోక కల్యాణం కోసం ప్రతిరోజూ దేవస్థానంలో పలు పూజలు ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నారు.
పారిశుధ్య పనుల పర్యవేక్షణ
దుర్గగుడిలో పారిశుధ్యం, చెత్త డంపింగ్‌ తదితర ప్రాంతాలను ఆలయ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి పర్యవేక్షించారు. చెత్త డంపింగ్‌ ప్రదేశం, దుర్గా ఘాట్‌ నందు యాత్రికుల సౌకర్యార్థం నిర్మాణంలో ఉన్న దుస్తులు మార్చుకొను రూములు, తదితర పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. హాకర్లతో మాట్లాడి వారికి దేవస్థానం కేటాయించిన స్థలము మాత్రమే వినియోగించుకోవాలని కోరారు.