Jan 23,2023 16:47

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నిరంతరం పోరాటం చేయడం ద్వారానే సమానత్వాన్ని సాధించుకోగలమని ప్రపంచ విప్లవ యోధుడు చే గువేరా కుమార్తె డాక్టర్‌ అలైదా గువేరా అన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడ ఎంబివికెలో జరిగిన క్యూబా సంఘీభావ సభలో కుమార్తె ఎస్తోఫినా గువేరాతో కలిసి ఆమె పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం లభించింది. నగర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అలైదా, ఎస్తోఫినియాను సత్కరించారు. సంఘీభావ సభ నిర్వహణ కమిటీ కన్వీనర్‌ బుడ్డిగ జమిందార్‌ వక్తలను వేదిక మీదకు ఆహ్వానించగా మరో కన్వీనర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. సభలో సిపిఎం, సిపిఐ, రాష్ట్ర కార్యదర్శులు, సిపిఐఎంఎల్‌ న్యూడెమెక్రసీ, ఎంసిపిఐ, ఎస్‌యుసిఐసి, ఆర్‌ఎస్‌పి, పార్వార్డ్‌బ్లాక్‌, సిపిఐఎంఎల్‌, కాంగ్రెస్‌, టిడిపి, వైసిపికి చెందిన నాయకులు హాజరయ్యారు. సభకు వచ్చిన ప్రతినిధులందరూ లేచి నిలబడి అలైదా, ఎస్తోఫినియాను గౌరవించారు. సభ ఆసాంతం వక్తలు మాట్లాడుతున్నంతసేపు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు మారుమోగాయి.
ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ పోరాటం ద్వారానే అన్ని రకాల వివక్షలను, అసమానతలను అధిగమించగలమని చెప్పారు. పోరాటం ద్వారానే ప్రజల మధ్య సంఘీభావం కూడా వస్తుందని, ఒకరి కోసం మరొకరు పనిచేస్తారని చెప్పారు.తాను వివిధ దేశాల్లో తిరిగే సమయాల్లో అనేక విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. పిల్లల వైద్యురాలిగా అంగోలాలో పనిచేసే సమయంలో అక్కడ పిల్లలు మిలియన్ల సంఖ్యలో చనిపోయేవారని, దాన్ని చూడలేకపోయానని పేర్కొన్నారు. క్యూబాలో ఒక చిన్న మరణం జరగాలంటే అనారోగ్యపరమైన, లేదా ప్రమాదం కారణంగా ఉండాలనీ, కానీ అంగోలాలో ఏ కారణం లేకుండానే పిల్లలు చనిపోవడం కలిచివేసిందని తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోడం ద్వారా సంఘీభావ అవసరాన్ని తెలుసుకున్నానని చెప్పారు. అలాగే యుద్ధాల వల్ల ప్రజల జీవితాన్ని కోల్పోతున్నారని, ప్రజలు కలిసి కట్టుగా జీవించడం అనేది తగ్గిపోయిందని వివరించారు. ప్రతి దేశంలోనూ ప్రజారోగ్యం, విద్య కోసం నిరంతరం పోరాడాలని కోరారు. ప్రజల అవసరాలు ఏమిటో నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని, నేను అనే పదాన్ని మర్చిపోయి మేము అనే పదాన్ని వాడటం మొదలుపెట్టాలని సూచించారు. దీనిల్ల ప్రజల మధ్య దూరం తగ్గిపోయి గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. తాను నికరాగువా, ఈక్వెడార్‌లో పనిచేసే సమయంలో అక్కడి ప్రజలు పుస్తకాల్లో లేని అనేక విషయాలు నేర్పించారని తెలిపారు. నిరంతరం ప్రజలు చెప్పేది వినాలని, ప్రతి మనిషీ ప్రతి ఒక్కరికీ ఏదోఒకటి నేర్పించగలరని తెలిపారు. సమనాత్వం కోసం పోరాటం జరుగుతూనే ఉండాలని, అందులో లింగబేధం ఉండకూదని తెలిపారు. మత విశ్వాసాల ఆధారంగా ప్రజలను ఎప్పుడూ చూడకూడదని పేర్కొన్నారు. భారతదేశ ప్రజల నుండి విశేష ప్రేమ ఆదరణ, గౌరవం లభించిందని, ఇది తన తండ్రి వల్ల వచ్చిందని మరువలేనని వివరించారు.

  • టీ షర్టులో... జెండాల్లో కాదు

చే గువేరా పట్ల ఇక్కడి ప్రజల్లో ఉన్న ఆదరణను తాను గుర్తించానని చెప్పారు. తన తన తండ్రి ఫొటోలను, మాటలను టీషర్టుల మీద, జెండాల మీద ముద్రించడాన్ని గమనించానని చెప్పారు. అది చాలదని, చే చూపిన మార్గాన్ని ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళని చెప్పారు. ఈ సందర్భంగా ' నామరణం తరువాత నా గురించి ఏడవవద్దు... నేను చేసిన దాన్ని మీరు చేయండి. చేస్తూనే ఉండండి, అప్పుడు నేను ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాను' అన్న అర్జెంటీనా పాటను ఆమె పాడారు. అలా చేయడం ద్వారానే చేగువేరా ప్రజల్లో నిలిచిపోతారని తెలిపారు. సౌభ్రాతృత్వం కోసం ఒకరికి చేయిచ్చి కలిసికట్టుగా పోరాడాలని కోరారు. విప్లవం గురించి నిరంరతం మాట్లాటం ద్వారానే అది అమలు చేయగలని తెలిపారు.

  • మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళుతున్న క్యూబా

భారత క్యూబా సంఘీభావ కమిటీ జాతీయ నాయకులు ఆర్‌.అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కింద నిలిగిపోతున్న క్యూబా ప్రజలు సోషలిజం స్ఫూర్తితో మొక్కవోని ధైర్యంగా ముందుకు వెళుతున్నారని తెలిపారు . అక్కడి ప్రజలు ఆరోగ్యంగా బతుకుతున్నారని, ఉచిత విద్య అందిస్తోందని చెప్పారు. కష్టానికి ప్రతిఫలం అందించే దేశంగా నేడు ప్రపంచంలో నిలిచిందని, కరోనా సమయంలోనూ వేలమంది వైద్యులను ప్రపంచదేశాలకు పంపించిందని చెప్పారు, ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రజలు ఏమి కావాలో తెలుసుకునేందుకు 1.13 కోట్ల మంది ఉన్న దేశంలో 83 లక్షలమంది ప్రజల అభిప్రాయం తీసుకున్నారని, అంతకంటే ప్రజాస్వామ్యం ఏముటుందని ప్రశ్నించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారతదేశంలో ఒక్క చట్టం కూడా ప్రజలను అడిగి చేయలేదని, వద్దంటున్నా నూతన ఆర్థిక విధానాలు, నూతన విద్యావిధానం, కార్మికచట్టాలు, రైతాంగా వ్యతిరేక చట్టాలు చేశారని పేర్కొన్నారు. క్యూబాలో ఆందోళన చేస్తున్న ప్రజల్లోకి ఫైడల్‌ కాస్ట్రో నేరుగా వెళ్లి వారిపై తనకు నమ్మకం ఉందని ప్రకటించారంటే సమాజవాదంమీద ఆయనకు ఎంత నమ్మకమో చేప్పలేనిదన్నారు

  • పోరాటంలో ప్రపంచానికి స్ఫూర్తి క్యూబా

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 1991లో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోయిందని, ఆ సమయంలో క్యూబా అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో మాట్లాడుతూ చావనైనా చస్తాంగానీ, సోషలిజాన్ని వదులుకోమని శపథం చేశారని, ఇప్పటికీ ఆ దేశ ప్రజలు స్ఫూర్తి దాయకంగా నిలబడ్డారని వివరించారు. క్యూబా విప్లవ పోరాటం తరువాత చేగువేరా తొలిసారి ఇండియాను సందర్శించారని తెలిపారు. అప్పటి ప్రధాని నెహ్రూ ఆయనకు స్వాగతం పలికారన్నారు. క్యాస్ట్రోతో కలిసి చేపట్టిన అలీనోద్యమం ప్రపంచంలోనే భారతదేశం ఒక శక్తిగా రూపొందించేందుకు ఉపయోగపడిందని తెలిపారు. . మనదేశంలో కరువు వచ్చిన సమయంలో రష్యా అండగా ఉందని తెలిపారు. విశాఖ ఉక్కును సోవియట్‌ సాయంతో నిర్మించారని తెలిపారు. అయితే సామ్రాజ్యవాద తొత్తులుగా మారిన నేటి ప్రభుత్వాలు వాటిని అమ్ముతున్నాయని తెలిపారు. సోషలిజం సాయంతోనే మనదేశం ఆర్థికంగా నిలడిందని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోనూ క్యూబాపై ఆంక్షలు విధించే సమయంలో ప్రపంచదేశాల నుండి వ్యతిరేకత వచ్చినా అమెరికా సిగ్గులేకుండా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. అయిల్‌ దిగుమతి విషయంలో అమెరికా ఆంక్షలు పెడుతోందని వివరించారు. చైనా స్వేచ్ఛగా సరుకులు ఎగుమతి చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో సంఘీభావం తెలపడం ద్వారా సోషలిస్టు వ్యవస్థలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కోరారు.

  • ప్రపంచ మానవులు సుఖంగా ఉండాలని కోరుకున్నారు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చేగువేరా అమరజీవి అయ్యారన్నారు. ప్రపంచ మానవుడు సుఖంగా ఉండాలని కోరుకున్నారని, అందువల్లే ఆయనను ప్రపంచ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. ఆరు దశాబ్దాలుగా ఒక్క అడుగూ వెనక్కు వేయకుండా ధైర్యంగా నిలబడి క్యూబా ప్రజలు పోరాడుతున్నారని వివరించారు. క్యాస్ట్రోను చంపాలని వందలసార్లు ప్రయత్నించిందని, అయినా ధైర్యంగా అమెరికాను ఎదిరించిన దేశంగా నిలిచిందని తెలిపారు.

  • క్యూబాలో నిజమైన స్వతంత్రం

వైసిపి నాయకులు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ అర్థరాత్రి మహిళా స్వేఛ్చగా తిరగ గిలిగితేనే నిజమైన స్వాతంత్య్రం అన్నారని, అది క్యూబాలో అమలు జరుగుతోందని తెలిపారు. ఇప్పటికీ పాశ్చాత్యదేశాల అనైతిక విధానాలను అక్కడకు రానీయరని పేర్కొన్నారు.

  • విప్లవానికి ప్రతీక చేగువేరా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ విప్లవ పోరాటం అనంతరం చేగువేరా అన్ని పదువులనూ త్యజించి కాంగో పోరాటంలో పాల్గన్నారని, బలీవియాలో సిఐఏ ప్రతినిధులు హత్య చేశారని తెలిపారు. వారి తనయ అలైదా గువేరా విప్లవానికి చిహ్నంగా నిలిచారని తెలిపారు.

  • ఆయన జీవితం స్ఫూర్తిదాయకం

పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ విప్లవ పోరాటంలో వైవిధ్య భరితమైన చేగువేరా జీవితం ఎంతో స్ఫూర్తి దాయకమన్నారు. పోరాట నాయకుడిగా, వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఈ శతాబ్దంలోనే బలమైన ముద్రవేశారని ఆయన స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.

  • అంతర్జాతీయ పోరాట చిహ్నం

సభకు అధ్యక్షత వహించిన క్యూబా సంఘీభావ సభ కన్వీనర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అమెరికాను ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది క్యూబా అన్నారు. అంతర్జాతీయంగా పోరాటాల చిహ్నం చేగువేరా అన్నారు. న్యూడెమెక్రసీ నాయకులు ప్రసాదు మాట్లాడుతూ విప్లవ పోరాటం అనంతరం క్యూబాలో సోషలిజం నిర్మాణానికి కాస్ట్రో పనిచేస్తే ప్రపంచ సోషలిజం కోసం చేగువేరా వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ క్యూబా ప్రజలకు ప్రపంచదేశాల నుండి పెద్దఎత్తున సంఘీభావం వస్తోందని తెలిపారు. ప్రపంచీకరణ ప్రారంభమైన తరువాత ఇప్పుడు ఎక్కువమంది సోషలిజం వైపు చూస్తున్నారని తెలిపారు. సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు మూర్తి, న్యూడెమెక్రసీ నాయకులు రామకృష్ణ, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు, సిపిఎంఎల్‌ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, ఎస్‌యుసిఐసి నాయకులు అమర్‌నాథ్‌, ఎంసిపిఐ నాయకులు ఖాదర్‌భాషా, సుందరరామరాజు మాట్లాడుతూ చేగువేరా చనిపోయి 50 సంవత్సరాలు దాటిపోతున్నా ఆయన పోరాట స్పూర్తి ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు. రమాదేవి, వనజ, దుర్గాభవానీ మాట్లాడారు. క్యూబా సంఘీభావ సభ నిర్వహణ కమిటీ నాయకులు వై.వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సభలో నాగార్జునా యూనివర్శిటీ ఆచార్యులు అంజయ్య తదితరులు పాల్గన్నారు.

cuba-solidarity-meeting-in-vijayawada-alaida-guvera-speechcuba-solidarity-meeting-in-vijayawada-alaida-guvera-speech

 

cuba-solidarity-meeting-in-vijayawada-alaida-guvera-speech


 

cuba-solidarity-meeting-in-vijayawada-alaida-guvera-speech

.

cuba-solidarity-meeting-in-vijayawada-childrencuba-solidarity-meeting-in-vijayawada-childrencuba-solidarity-meeting-in-vijayawada-children