Dec 28,2021 16:53

- సిపిఎం రాష్ట్ర మహాసభలు తీర్మానం
ప్రజాశక్తి-జక్కావెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ :ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని, ప్రైవేటీకరించాలి లేదా కార్పొరేట్లకు అమ్మేయాలనే కేంద్రం నిర్ణయాలను తిప్పికొట్టే విషయంలో వెనక్కి తగ్గేది లేదని సిపిఎం రాష్ట్ర 26వ మహాసభ తీర్మానం చేసింది. గుంటూరుజిల్లా, తాడేపల్లిలోని జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌లోని టి షడ్రక్‌, రెడ్డి శ్రీరామ్మూర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీర్మానం వివరాలను సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ నర్శింగరావు మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ..''విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటు కంపెనీకి అమ్మాలని జనవరి 27 2021న కేంద్ర క్యాబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆరోజు నుండి మేం వ్యతిరేకిస్తున్నాం. 315రోజుల నుండి రిలేనిరాహార దీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాం ఇంకా కొనసాగుతోంది. బిజెపి మైండ్‌గేమ్‌ ఆడుతోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంట్‌లో బిజెపి నాయకులే దీనిపై ప్రశ్నలు వేయించుకుని సమాధానంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని, ప్రైవేటీకరణ చేస్తామని పట్టుదలతో ప్రకటనలు చేస్తున్నారు. మేం కూడా అంతకన్నా ఎక్కువ పట్టుదలతో కేంద్రం నిర్ణయానికి వెనక్కి తిప్పికొట్టేందుకు పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 స్ట్రాటజిక్‌ ఫెయిల్‌ పరిశ్రమల్లో 1శాతం కూడా ఇప్పటి వరకు అమ్మని పరిశ్రమ విశాఖ స్టీల్‌ పరిశ్రమ. ఇది దేశంలోనే ఉత్తమమైన కంపెనీ. రూ.20వేల కోట్ల టర్నోవర్‌ ప్రతి సంవత్సరం సాలీన ఉత్పత్తి చేస్తోంది. రూ.44వేల కోట్లు ఇప్పటి వరకు కేంద్రానికి డివిడెండ్లు, పన్నులు రూపంలో చెల్లించింది. కేవలం కేంద్రం రూ.5వేల కోట్లు మాత్రమే దీనిలో పెట్టుబడులు పెట్టింది. 1991 నుండి ఒక్క రూపాయి కూడా ఈ పరిశ్రమకు సహాయం అందలేదు. అయినప్పటికీ 7.3మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఇది విస్తరించింది. ఇంకా అభివృద్ధి అయ్యేఅవకాశం ఉంది. ఇటువంటి పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మితే ఎపికి తీరని ద్రోహం చేసినట్లే అవుతుంది. విభజన చట్టంలోని ప్రత్యేకహోదా, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వేజోన్‌ ఇవేవీ అమలు చేయకపోగా, ఎపికి తలమానికగా ఉన్న ప్రభుత్వ భారీ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామనడం అత్యంత దుర్మార్గం. కేంద్రం మైండ్‌గేమ్‌ ఆడుతూ విశాఖ ఉక్కును అమ్మేశాం లేదా ప్రైవేటీకరణ చేసేశాం అని చెబుతోంది..ఏమీ కాలేదు. వాటాలు అమ్మడానికి సలహాదారుని నియమించారు. ట్రాన్సాక్షన్‌, లీగల్‌ అడ్వైజర్లను కేంద్రం నియమించింది. వారికి 2 నుండి 3 సంవత్సరాల వాల్యుయేషన్‌ రిపోర్ట్‌ను విలువకట్టేందుకు సమయం ఇచ్చారు. వారు విలువ కేట్టేందుకు పరిశ్రమలోనికి వెళ్లాల్సి ఉంది. కానీ మేం వెళ్లనివ్వలేదు..ఇకమీదట కూడా వెళ్లనిచ్చే ప్రసక్తే లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకుంటూనే ఉంటాం. వ్యాల్యుయేషన్‌ ప్రక్రియ పూర్తయితే ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, బిడ్డింగ్‌ పిలవడం అనేవి ఉంటాయి. ఈ ప్రక్రియలను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనియ్యం...ఖచ్చితంగా అడ్డుకుంటాం. లాభాల బాటలో నడిచే పరిశ్రమలను కారుచౌకగా కార్పొరేట్లకు ఇవ్వాలనే బిజెపి ప్రయత్నాన్ని పోరాటాలతో అడ్డుకుంటాం. ఎపికి అన్యాయం జరగనివ్వం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం ప్రధాన సమస్య. కార్పొరేట్లకే గనులను కేంద్రం కేటాయిస్తోంది తప్ప, ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక గనిని కూడా ఇవ్వలేదు. అదానీకి గంగవరం పోర్టును కేంద్రం కట్టబెట్టింది. ఎపి అభివృద్ధికి విశాఖ ఉక్కు ఎంతగానో తోడ్పడుతోంది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగి ప్రాంతాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉన్న గాజువాక, గెంటాడ మండలాల్లో ఉన్నాయి. రూ.2,64,000 తలసరి ఆదాయం ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉంది. 32మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్ల కోరల్లో చిక్కకుండా అడ్డుకుంటాం. రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సదస్సులు, కోటి సంతకాల సేకరణ చేయాలని తీర్మానం చేశాం. అన్ని జిల్లాలు ఈ విధంగా తీర్మానాలు చేస్తాయి. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగానూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం'' అన్నారు.