చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడం జరుగుతుంది. ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
చలికాలంలో దాహంగా అనిపించదు. మంచినీళ్లు తక్కువ తీసుకోవడం వల్ల మొదడులోని హిస్టామిన్లు అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల తలనొప్పి రావొచ్చు. జీర్ణక్రియలు నెమ్మదిస్తాయి. గంటకో సారి కొద్దిగానైనా మంచి నీళ్లు తాగటం వల్ల ఈ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.
రోజూ ఏదొక వేళ శరీరానికి చెమట్లు పట్టేలా నడవాలి. చర్మంపై సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. దీంతో మలినాలు బయటకు పోయి కాంతివంతంగా కనిపిస్తుంది. చర్మాన్ని ప్రతి రోజూ కొబ్బరినూనెతో మర్దన చేస్తుంటే పగుళ్లు ఏర్పడవు.
కాళ్లు, పెదవులు పగుళ్లు సమస్య ఉన్నవాళ్లు తప్పకుండా వెన్న, నూనెతో ఉదయం, సాయంత్రం వేళల్లో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
ఆహారంలో ఆకుకూరలు, పాలు, దానిమ్మ ఉండేలా చూసుకుంటే అవి చర్మ సంరక్షణకు దోహదపడతాయి.
చలిగాలిలో ప్రయాణం చేయాల్సి వస్తే ముక్కులోకి, చెవుల్లోకి గాలి వెళ్లకుండా తప్పకుండా మాస్క్ ధరించాలి.
రాత్రివేళల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గి అరికాళ్లు చల్లబడి నిద్రకు భంగం కలుగుతుంది. సాక్సులు ధరించి పడుకుంటే అలాంటి ఇబ్బంది ఉండదు.
గర్భిణీలు ఎక్కువ పొరలు ఉన్న దుస్తులు ధరించాలి. ఇన్ఫెక్షన్లకు గురికాకుండా 'సి' విటమిన్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలి.
చలికాలంలో అరుగుదల సమస్య ఎక్కువగా ఉంటుంది. నూనె పదార్థాలు తగ్గించి- బెల్లంతో చేసిన పల్లీ పట్టి, నువ్వుల లడ్డు వంటి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది.